టీడీపీతో జనసేన కలిస్తే, బీజేపీ పరిస్థితేంటి.?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదని పదే పదే నిరూపితమవుతూనే వుంది. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి ఆ కాసిన ఓట్లు వచ్చాయి. అదే, ఆ రెండు పార్టీలూ బరిలో వుంటే, బీజేపీ పరిస్థితి నోటా కంటే దారుణంగా వుండేదే.

సరే, రాజకీయాల్లో గెలుపోటములనేది  సర్వసాధారణం.. అనేది వేరే మాట. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది జనసేన. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. 2024 ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే, బీజేపీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని తేలిపోయాక, బీజేపీని పట్టుకుని వేలాడటం జనసేనకు సాధ్యం కాకపోవచ్చు. జనసేన ప్లస్ టీడీపీ అనే ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. అందుకు తగ్గట్టే, టీడీపీ వీలైనంతగా జనసేనకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

చంద్రబాబు అతి త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అవబోతున్నారనీ, ఆ భేటీ విషయమై తగిన సమయం కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారనీ రాజకీయ వర్గాల్లో గుసుగుసలు వినిపిస్తున్నాయి.

బీజేపీ మాత్రం, ఇదంతా తప్పుడు ప్రచారమంటోంది. జనసేనదీ సేమ్ వాయిస్. టీడీపీ మాత్రం, భవిష్యత్తులో టీడీపీ – జనసేన కలిసే అవకాశం వుందంటూ లీకులు పంపుతోంది. కింది స్థాయిలో అప్పుడే, ఈ విషయమై టీడీపీ వర్గాల్లో జోరున చర్చ నడుస్తోందట.

‘మనం జనసేనతో కలిసి పోటీ చేయబోతున్నాం.. జనసేనతో వైరం పెంచుకోవద్దు..’ అంటూ కింది స్థాయి నాయకులకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది.