ఎన్టీయార్ ప్రవచనాలపై టీడీపీ గుస్సా.. ఎందుకలా.?

జూనియర్ ఎన్టీయార్ ఫక్తు రాజకీయ నాయకుడు కాదు. ఆయనో సినీ నటుడు మాత్రమే. ఖర్మ కాలిపోయి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడని ఆయన అభిమానులు ఫీలవుతుంటారు. తెలుగుదేశం పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి జరిగిన అవమానాలు అలాంటివి మరి.

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నాయకులు కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారట. వాటిపై, జూనియర్ ఎన్టీయార్ తీవ్రంగా స్పందించలేదట. ఇదీ వర్ల రామయ్య సహా కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. నిజానికి, జూనియర్ ఎన్టీయార్.. ఆ ఘటనపై స్పందించాడు, సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు.

అంతకన్నా జూనియర్ ఎన్టీయార్ చేయగలిగిందేమీ లేదు కూడా. కానీ, జూనియర్ ఎన్టీయార్ ప్రవచనాలు చెప్పాడనీ, కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడలేదనీ వర్ల రామయ్య, బుద్దా వెంకన్న తదితరులు మండిపడ్డారు. ఇదెక్కడి చోద్యం.?

వైసీపీ నేతల మీద నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించలేదు. మరి, నారా లోకేష్ మీద ఎందుకు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడంలేదు.? ఇక్కడ మేటర్ క్లియర్. జూనియర్ ఎన్టీయార్ మీదికి వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలను చంద్రబాబే ఉసిగొల్పారు.

సినిమా కెరీర్‌ని పాడు చేసుకుని రాజకీయాల్లో జూనియర్ ఎన్టీయార్ తల దూర్చే పరిస్థితి లేదు. హరికృష్ణ విషయంలో టీడీపీ ఎన్ని అవమానాలు చేసిందో, తన విషయంలో టీడీపీ ఎన్ని అవమానాలు చేసిందో జూనియర్ ఎన్టీయార్‌కి తెలుసు. అయినా, తాత స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన పార్టీ పట్ల ఇంకా గౌరవభావంతోనే వున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. దాన్ని చెడగొట్టడానికే వర్ల, బుద్ధా తదితరులు ప్రయత్నిస్తున్నారేమో.!