ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కూరుకుపోవడానికి అనేక కారాణాలున్నాయి. వాటిలో ప్రధానమైనది యువనాయకత్వం లేకపోవడం. సీనియర్ లీడర్లంతా సైలెంట్ అయిన వేళ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన యంగ్ లీడర్స్ మౌనం వహించారు. మనకెందుకులే అన్నట్టు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకుల వారసులంతా పేరుకు పార్టీలోనే ఉన్నారు కానీ ఎక్కడా కనిపించరు. ఉన్నపళంగా టీడీపీలో యాక్టివ్ దశలో ఉన్న యువ నాయకులను లెక్కపెడితే నారా లోకేష్, ఎంపీ రామ్మోహన్ నాయుడు మినహా మిగతా ఎవరూ కనబడరు. ప్రజెంట్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని అది కూడ యువ నాయకుడిని ఎన్నిక చేయాలనే ఆలోచన చంద్రబాబు మదిలో ఉంది.
కొడుకును పైకి తీసుకురావాలని అనుకుంటున్న చంద్రబాబు లాంటి లీడర్ ఏదైనా అవకాశం ఉంటే దాన్ని కుమారుడికే అప్పగిస్తారు. కానీ బాబుగారు మాత్రం నారా లోకేష్ చేతికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. అందుకే రామ్మోహన్ నాయుడు పేరును కూడ పరిగణలో పెట్టుకుని తర్జన భర్జన చేస్తున్నారు. ఈ పరిస్థితి మొత్తం గమనిస్తున్న కొందరు సీనియర్ లీడర్లు జూ. ఎన్టీఆర్ పార్టీలో ఉంటే యువనాయకత్వానికి ఎలాంటి లోటు ఉండేది కాదు. అధ్యక్ష పగ్గాలు ఆయనకే అప్పచెప్పవచ్చు. పార్టీకి బలం, గ్లామర్ ఇలా అన్ని విధాలుగా తారక్ అక్కరకు వచ్చేవాడు కదా అనుకుంటున్నట్టు భోగట్టా.
కానీ అసలు ముసలం ప్రధాన నాయకుడి రూపంలో కూర్చుని ఉంది. అదే చంద్రబాబు. జూనియర్, బాబు మధ్య పెద్ద అగాథం ఉంది. అది అంత సామాన్యంగా పోయేది కాదు. బాబు వైఖరితో జూనియర్ మనసు విరిగిపోయినంత పనైంది. ఆయనకై ఆయన పార్టీలోకి వస్తానని అనరు. అలాగని బాబుగారు ఆహ్వానించరు. ఎందుకంటే తారక్ వస్తే నారా లోకేష్ పరిస్థితి ఏమవుతుందో ఆయనకు తెలుసు. అందుకే ఆహ్వానించరు. కానీ తారక్ అవసరం పార్టీకి ఉంది. ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలంటే సీనియర్లు అందరూ కలిసి బాబు మీద ఒత్తిడి తేవాలి. సంక్షోభం నుండి బయటపడటానికి, కొత్త శక్తిని పుంజుకోవడానికి తారక్ ఉపయోగపడతాడనే వాస్తవాన్ని ఆయనకు వివరించి ఒప్పించాలి. ఆయనే తారక్ ను పార్టీలోకి ఆహ్వానంచేలా చేయాలి. అప్పుడే తారక్ మెత్తబడి తాత పెట్టిన పార్టీని ఆదుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది.