TDP Or Janasena : వైసీపీ దిగిపోతే, జిల్లాల సంఖ్య తగ్గించేస్తారా.?

TDP Or Janasena :  ‘జగన్ సర్కారు మూడు రాజధానులంటోంది.. మేం మాత్రం ఏకైక రాజధానికే కట్టుబడి వున్నాం..’ అంటూ విపక్షాలు నినదిస్తున్న సంగతి తెలిసిందే. మరి వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యని 13 నుంచి 26కి పెంచిన దరిమిలా, ఆ జిల్లాల పెంపు శాస్త్రీయంగా లేదంటున్న విపక్షాలు.. ‘మేం అధికారంలోకి వస్తే, జిల్లాల సంఖ్యను తగ్గిస్తాం..’ అనగలవా.?
ఏమో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది గనుక.. ఆ అమరావతికి పాతరేసింది వైఎస్ జగన్ సర్కారు. అమరావతిని స్మశానమంటున్నారు, ఎడారి అంటున్నారు.. రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేశారు.
తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు ఛావండి.. అన్నట్టుగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్న విమర్శలు లేకపోలేదు. జిల్లాల కేంద్రాలు, వాటిల్లో కలెక్టరేట్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ప్రస్తుత జగన్ సర్కారు తీసుకున్న చర్యలపై పెదవి విరుపులే వ్యక్తమవుతున్నాయి విపక్షాల నుంచి.
పూర్తి స్థాయిలో జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చెందాలంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. పొద్దున్న కొత్త జిల్లాల నుంచి పాలన లాంఛనంగా ప్రారంభమైతే, సాయంత్రానికి ఆయా కొత్త జిల్లాల్లో భూముల ధరలు పెంచేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో, జనం ఒక్కసారిగా విస్తుపోవాల్సి వచ్చింది.
విపక్షాలకు ఇదొక అస్త్రంగా మారింది. కొత్త జిల్లాలతో రాష్ట్ర అభివృద్ధి కొంత సులభతరమవుతుందన్నది నిర్వివాదాంశం. కానీ, విపక్షాలు అడ్డు తగలితే, ఏ పనీ ముందుకు నడవదు.
పైగా, రాష్ట్రంలో రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయ్. ఏమో, భవిష్యత్ ఎలా వుంటుందోగానీ.. ఇరవై ఆరు జిల్లాలు శాశ్వతమా.? కాదా.? అన్న గందరగోళమైతే అలాగే వుంది.