ప్రతిపక్షం టీడీపీ నుండి పాలక పక్షం వైసీపీలోకి వెళ్లాలనుకునే నేతలు ఒక్కొకరిగా బయటపడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలోకి టర్న్ తీసుకున్నారు. జగన్ వీరికి కండువా కప్పి పార్టీలోకి తీసుకోకపోయినా వారికి ఎలా వాడాలో అలా వాడుతున్నారు. మరొక ఎమ్మెల్యే గంటా సైతం టీడీపీని వీడతరానే వార్తలు వస్తుండగా తాజాగా మరొక యువనేత సైకిల్ దిగి ఫ్యాన్ కిందికి చేరే సన్నాహాల్లో ఉన్నారు. ఆయనే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్. గతంలో అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేస్వరరావు కుమారుడే శ్రావణ్. సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మరణించగా శ్రావణ్ ను మంత్రిని చేశారు చంద్రబాబు.
రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన శ్రావణ్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుండి ఆయన పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం మానేశారు. నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా కూడా సమనపరుచుకోవడంలో విఫలమయ్యారు. దాంతో అధికార పార్టీలోకి టీడీపీ నుండి వలసలు మొదలయ్యాయి. పైపెచ్చు టీడీపీ భవిష్యత్తు కూడా అంతంతమాత్రమే అనే పరిస్థితి ఉండటంతో ఇక చేసేది లేక ఆయన కూడా వైసీపీలోకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ కూడా శ్రావణ్ పార్టీలోకి రావడాన్ని అడ్డుకోవడంలేదట.
ఎందుకంటే కిడారి సర్వేశ్వరరావు 2014లో వైసీపీ నుండే ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ విప్ హోదాను దక్కించుకున్నారు. కిడారి కుటుంబం ఏ పార్టీలో ఉన్నా వారికి ఒక నిర్థిష్టమైన అనుచరగణం ఉంది. అందుకే కిడారి శ్రావణ్ కు వైసీపీ తలుపులు తెరించిందట. ఒకవేళ ఇదే నిజమై శ్రావణ్ పార్టీ మారిపోతే ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీ హవాకు చెక్ పడినట్టే అవుతుంది. ఇప్పటికే పాడేరులో బలహీనపడిన తెలుగుదేశం అరకులో కూడా మూలనపడితే మన్యంలో వైసీపీ మరింత బలంగా తయారవుతుంది. మన్యం మీద పట్టు దొరికితే విశాఖ మీద పట్టు పెరిగినట్టే.