కీలకమైన ఏపీ రాష్ట్ర కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. 219 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు ఈ కమిటీలోఉన్నారు. ఇక రాష్ట్ర కార్యదర్శుల సంఖ్య సెంచరీ దాటింది, 108 మంది రాష్ట్ర కార్యదర్శులను ఓ కోశాధికారిని ప్రకటించారు.
కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు కాగా.. మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కింది. 61శాతం పదవులు బీసీ, ఎస్సీలను వరించాయి. బీసీలకు 41శాతం, ఎస్సీలకు 11శాతం, ఎస్టీలకు 3శాతం, మైనార్టీలకు 6శాతం ప్రాతినిధ్యం లభించింది. ఇక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్‌కు కీలక పదవి వరించింది. ఆయన్నిసెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించారు టీడీపీ అధినేత.
ఈ జాబితా విడుదల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీ గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టినట్లు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మొహమాటాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ కోసం జాబితాను సిద్దం చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడం వల్ల కార్యవర్గం పరిమాణం పెరిగిందని చెప్పారు. ప్రజా ఉద్యమాలతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే అంతా కలిసి పనిచేయాలని నేతలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.