TDP and Jansena : పొత్తు పొడిచేనా.? టీడీపీ, జనసేన.. చెరిసగం ప్రతిపాదన.!

TDP and Jansena : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య పొత్తు పొడుస్తుందా.? లేదా.? అన్న విషయమై గందరగోళం కొనసాగుతోంది. ఇద్దర్నీ ఎలాగైనా కలిపెయ్యాలన్న తపన వైసీపీలో కనిపిస్తోంది. ‘దమ్ముంటే సింగిల్‌గా రండి..’ అంటూ రెచ్చగొడుతూనే వుంది వైసీపీ. అది కలపడానికా.? విడదీయడానికా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.
జనసేన మాత్రం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని నినదిస్తోంది. దానర్థం విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని. విపక్షాల్లో పెద్ద పార్టీ టీడీపీ గనుక, ఆ పార్టీ వెంట మిగతా పార్టీలు నడవాలన్న భావన పవన్ మాటల్లో వుందన్నది మెజార్టీ అభిప్రాయం. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.
ఇదిలా వుంటే, 2024 ఎన్నికల్లో చెరిసగం సీట్లలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్నది తాజాగా వినిపిస్తోన్న ఓ గాసిప్. అధికారం కూడా చెరిసంగం పంచుకునేలా ప్రతిపాదనలు తెరపైకొస్తున్నాయట. కాగా, జనసేన మాత్రం తొలుత అధికారం తమకే దక్కాలని అంటోందంటూ ప్రచారం జరుగుతోంది.
ఏమో, ఈ ప్రచారాల్లో నిజమెంతోగానీ, ఏరు దాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయమై బీజేపీ, జనసేనను హెచ్చరిస్తోందట. జనసేన కూడా టీడీపీ మైండ్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని తమ పార్టీ శ్రేణులకు సూచిస్తోంది.
అసలిప్పుడు పొత్తుల చర్చలు ఎందుకు.? అన్నది జనసేన అధినాయకత్వం చెబుతున్నమాట.