హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరం ఎంత అతలాకుతలం అయిందో అందరం చూశాం. నిజంగా ఇది భారీ విపత్తు. దీన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. దీంతో తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పటికీ కొన్ని కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి అంటే హైదరాబాద్ కు ఏ స్థాయిలో వరదలు వచ్చాయో తెలిసిపోతుంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకోవడం, వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం చేస్తోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితుల కోసం సాయం అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. తమ వంతు సాయంగా 10 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం అందించింది. దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి లేఖ రాశారు.
10 కోట్ల సాయంతో పాటుగా… వరద బాధితుల కోసం బ్లాంకెట్లు, మ్యాట్స్, ఇతర సామాగ్రిని హైదరాబాద్ కు పంపిస్తున్నట్టు పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు. ఇంకా తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలన్నా.. చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు.