తమిళనాడు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్షను అనుభవించిన చిన్నమ్మ శశికళ.. రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే అన్నాడీఎంకేలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ భావించారు. అయితే… రోజుకో మలుపు తిరుగుతూ తమిళ రాజకీయాలు వేరొకలా సాగుతున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే దివంగత నేత జయలలిత జయంతి రోజున ఆమెకు నివాళులర్పించిన సందర్భంగా ఆమె ఆప్తురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన చేశారు.
జయలలిత జయంతి సందర్బంగా అక్కడకి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి శశికళ మాట్లాడుతూ… ‘అమ్మ నిజమైన కేడర్ ఏకం కావాలి.. అందరూ అన్నాడీఎంకే కోసం సమష్టిగా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. అమ్మ కోరుకున్నట్లుగా వందేళ్ల పాటు అధికారంలో ఉండేలా పని చేయటమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అందుకోసం అన్నాడీఎంకేతో కలిసి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కలిసి పని చేస్తుందని చెప్పటం ద్వారా.. అన్నాడీఎంకే చీలకలు ఏకం కావాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
అన్నాడీఎంకేలో అడుగడుగునా తనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయని తెలుసుకున్న శశికళ విరక్తితో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకులను కూడా కలుసుకోకుండా పార్టీ వ్యవహారాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక అన్నాడీఎంకే నేతలతో కయ్యం కంటే సంధే మేలని భావించిన శశికళ తాజాగా కలిసి వెళ్దామన్న సంకేతాలను అన్నాడీఎంకే కీలక నేతలకు పంపారు. మరి..చిన్నమ్మ సెంటిమెంట్ ప్రకటనపై ముఖ్యమంత్రి పళనిస్వామి.. మరో కీలక నేత పన్నీర్ సెల్వం ఇద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి.