తమిళనాడులో ఎన్నో ఏళ్ళ నుండి నానుతూ వున్న రజనీకాంత్ రాజకీయాంశానికి ఇటీవలనే తెరపడింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న చర్చకు తెర దించుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అయితే ఆయనకి రాజకీయ ప్రయాణం విషయంపై స్పష్టత తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం ఊరించిన తలైవా.. చివరకురాజకీయాల్లోకి రావటం బాగానే ఉన్నా.. ఎలాంటి రాజకీయాన్ని ఆయన ఎంచుకోనున్నారు? అన్న దానిపై అందరూ తలొకరకంగా అనుకుంటున్నారు. తాజాగా రజనీ చేసిన వ్యాఖ్యలు సైతం గందరగోళానికి గురి చేసేలా ఉండటంతో ఇప్పుడు అంతా ఇదే టాపిక్ మీద చర్చ నడుస్తుంది.
సూపర్ స్టార్ మాట్లాడుతూ… రాజకీయంలో అధ్యాత్మికం కలుపుతూ ఇచ్చిన స్టేట్ మెంట్ చాలామందిని కన్ఫ్యూజ్ చేసింది. రీల్ లైఫ్ లో తిరుగులేని విజయాన్ని సొంతంచేసుకున్న ఆయన రాజకీయ రంగంలో అలాంటి సక్సెస్ ల్నిసొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి.. రజనీకాంత్ కు అలాంటి సిస్టంను సిద్ధం చేసుకున్నారా? అన్నది మరో ప్రశ్న. ఓవైపు సమయం తక్కువగా ఉండటం.. ఆయన రాజకీయ ఎంట్రీ మీద ఆయన్ను అభిమానించే వారు విపరీతమైన అంచనాలు పెట్టుకోవటం కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టే అంశంగా చెబుతున్నారు.
ఇప్పటికే ఆయనపై బీజేపీ ముద్ర ఉంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు తెలీకుండానే బీజేపీ సిద్దాంతాలకు కాసింత మద్దతు ఇచ్చే ప్రకటనలు ఆయన నుంచి రావటంతో ఆయన మీద బీజేపీ ముద్ర పడింది. దీన్నిచెరుపుకునే ప్రయత్నం పెద్దగా చేయకపోవటం ఇప్పుడు డ్యామేజ్ అవుతుందన్నఅంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయన ముందున్న సమయం తక్కువగా ఉండటం మరో ఇబ్బందిగా చెబుతున్నారు.పార్టీ నిర్మాణం.. బలమైన క్యాడర్ ను నియమించుకోవటం.. అభ్యర్థుల ఎంపికతో పాటు.. ప్రజల మనసుల్ని దోచుకునేందుకు అవసరమైన పర్యటనలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇవన్నీ చేయటానికి ఆయనకు కావాల్సినంత సమయం లేదు. ఇదిలా ఉంటే.. ఆయన ఒంటరిగా పార్టీని నడుపుతారా? మరే పార్టీతోఅయినా కలిసి పోటీ చేస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందేహానికి కారణం.. ఇటీవల ఆయన చేసిన నియామకమే. బీజేపీ మేథో విభాగం తమిళనాడు అధ్యక్షుడిగా వ్యవహరించిన అర్జున్ మూర్తిని.. తన పార్టీ సమన్వయకర్తగా నియమించుకోవటంతో బీజేపీ భావజాలం రజనీ పార్టీ మీద పడే అవకాశం ఉందంటున్నారు.
సోలోగా పార్టీని నిర్వహిస్తే ఉండే లాభనష్టాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల బరిలో ఒంటరిగా దిగితే…అన్ని స్థానాలకు పోటీ చేయటంతో పాటు… అన్ని రాజకీయ పార్టీలను వెనుకా ముందు లేకుండా ఉతికి ఆరేసే వీలుంది. అదే సమయంలో పార్టీ తన సొంత బలం ఏమిటో తెలుసుకునే వీలు ఉంటుంది. ఇవన్ని ప్లస్ లు అయితే..మైనస్ లుకూడా బాగానే ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమిళనాడులో ఉన్న నేపథ్యంలో.. రజనీ ఒంటరిగా దిగితే ఏ మేరకు విజయవకాశాలు ఉంటాయన్నది పెద్ద ప్రశ్న. గతంలో మాదిరి ఇలా పార్టీ పెట్టి.. అలా విజయాన్ని సొంతం చేసుకునే పరిస్థితి లేదంటున్నారు. అన్నింటికి మించి సింగిల్ గా పార్టీ పెడితే.. ఫండింగ్ మాటేమిటి? అన్నది పెద్ద ప్రశ్న. అభ్యర్థుల నియామకంలోనూ ఆయన సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. దీంతో.. ఆయన ఒంటరిగా బరిలోకి దిగుతారా? ఎవరితోనైనా కలుస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.