చాలా ఏళ్ల నుండి తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ దండయాత్రలో రజినీ మినహా మిగతా స్టార్ హీరోలు చతికిలపడగా అనూహ్యంగా మిడిల్ లెవల్ హీరోలు నిలదొక్కుకున్నారు. సూర్య, కార్తీ, ధనుష్ లాంటి హీరోలు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి కాస్తో కూస్తో మార్కెట్ కూడగట్టుకున్నారు. నిలదొక్కుకోలేకపోయిన స్టార్ హీరోల్లో విజయ్ ఒకరు. విజయ్ తమిళనాట బడా హీరోనే అయినా తెలుగు ఆడియన్స్ మాత్రం చాలా కాలం ఆయన్ను లైట్ తీసుకున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆయన సినిమాలు తెలుగులో డబ్ చేసేసరికి తుస్సుమనేవి.
ఇది ఆయన్ను చాలా ఇబ్బందిపెట్టింది. ఎట్టకేలకు గత రెండేళ్లలోనే ఆయన కొద్దిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన చేసిన ‘విజిల్, మాస్టర్’ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు పర్వాలేదనిపించుకున్నాయి. దీంతో విజయ్ ఇంకో ముందడుగు వేశారు. ఈసారి డబ్బింగ్ సినిమా కాదు ఏకంగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో కొట్టాలని అనుకున్నారు. అందుకే తెలుగు దర్శకులకు కబురు పంపి కథలు వినడం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్లో వంశీ పైడిపల్లి ఆయన్ను కలవడం, కథ చెప్పడం, అది ఆయనకు నచ్చడం జరిగిందట. దీన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కించనున్నారు.
ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అవ్వగానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండూ ముగిశాక వంశీ పైడిపల్లి సినిమా ఉండవచ్చు.