హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ పాల్గొంది. భారత్ బంద్‌లో పాల్గొన్న మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి రైతు వెన్నెముక అని, దేశ వ్యాప్తంగా రైతన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు నడ్డి విరుగుతోందని, రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారని దుయ్యబట్టారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని, చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటుందని గుర్తుచేశారు. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు తీసుకువచ్చారని ప్రశ్నించారు.ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి, జీఎస్టీని మార్చలేదా? దేశంలో రైతుల పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా అని ప్రశ్నించారు. పంజాబ్, హరిహాణలో ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచుతామని, రైతాంగంతో డ్రామాలు ఆడితే మీ అధికార పీఠం కదులుతుందన్నారు.
చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుందని నిలదీశారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో ఒకసారి గమనించాలన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను కేంద్రం పరిగణలోకి తీసుకుందని గుర్తు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని మండిపడ్డారు.