తాడిపత్రి రాజకీయం: వైసీపీలోకి దూకెయ్యనున్న జేసీ బ్రదర్స్.!

JC Brothers to jump into YSR

JC Brothers to jump into YSR

ఇంకో మూడేళ్ళు ప్రతిపక్షంలో వుండి క్యాడర్‌ని పోగొట్టుకునే సాహసం జేసీ బ్రదర్స్ చేస్తారా.? అంటే, ఛాన్సే లేదన్న సమాధానం వినిపిస్తోంది. తాడిపత్రి మునిసిపల్ ఎన్నిక తర్వాత, మునిసిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యాక.. తాడిపత్రిలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి.

జేసీ బ్రదర్స్ అతి త్వరలో వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి రెండే రెండు మునిసిపాలిటీల్లో కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది ఇటీవల జరిగిన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో. ఆ రెండిట్లో ఒకటి తాడిపత్రి, ఇంకోటి మైదుకూరు. మైదుకూరు వైసీపీ పరం కాగా, తాడిపత్రిని మాత్రం టీడీపీ నిలబెట్టుకుంది. కాదు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రిలో తన పరువు నిలబెట్టుకున్నారు.. అదీ అదికార వైసీపీ దయతో. ఈ విషయం ఆయన మాటల్లోనే తేటతెల్లమవుతోంది. ‘వైసీపీ గనుక అడ్డుపడాలనుకుంటే నేను మునిసిపల్ ఛైర్మన్ అయ్యేవాడిని కాదు. మా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతోపాటు వైసీపీ నేతలకూ థ్యాంక్స్ చెబుతున్నా..’అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడమే కాదు, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిని నేను. వైఎస్సార్ కొడుకు కదా, జగన్ కూడా నైతిక విలువలకు కట్టుబడి తాడిపత్రిలో నా గెలుపుకు అవకాశం కల్పించారు..’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు విషయాన్ని చెప్పేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సుల వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అంతే కాదు, జేసీ బ్రదర్స్‌కి చెందిన వ్యాపారాలు గందరగోళంలో పడిపోయాయి. గుక్క తిప్పుకోనీయకుండా వరుస వివాదాల్లోకి జేసీ బ్రదర్స్‌ని నెట్టేసింది అధికార వైసీపీ. ఎలాగైతేనేం, పాత బంధాలు మళ్ళీ చిగురించేలా వున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పేసి అతి త్వరలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వైసీపీలో చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.