తెలంగాణ రాజకీయాల్లో మంత్రి ఈటెల రాజేందర్ అప్పుడప్పుడూ తనదైన వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తోన్న విషయం విదితమే. ‘మేం ఉద్యమ నాయకులం.. మేమే, గులాబీ పార్టీకి ఓనర్లం.. వలస నేతల పెత్తనం చెల్లనివ్వం..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెను దుమారం రేపాయి. ఆ తర్వాత పలు సందర్భాల్లో.. అంటే, వీలు చూసుకుని మరీ.. సొంత పార్టీలో కొందరు నేతలే లక్ష్యంగా ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ మధ్యనే ఇంకోసారి రైతుల సమస్యల్ని ప్రస్తావిస్తూ, పరోక్షంగా పార్టీ అధినాయకత్వంపై సెటైర్లు వేశారు ఈటెల రాజేందర్. అయితే, గులాబీ పార్టీలో ఈటెల సీనియర్ నేత కావడం, ఉద్యమ నాయకుడు కావడంతో ఆయన్ని విమర్శించేందుకు గులాబీ నేతలెవరూ అత్యుత్సాహం చూపడంలేదు. ఇదిలా వుంటే, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటెల వద్ద రాజకీయాల ప్రస్తావన వచ్చింది. అయితే, రాజకీయాల గురించి మాట్లాడే సమయం, సందర్భం ఇది కాదంటూ ఈటెల రాజేందర్, సమాధానాల్ని దాటవేసేశారు. ‘ప్రగతి భవన్‌తో మీకు గ్యాప్ వుందా.? లేదా.?’ అని ప్రశ్నిస్తే, ఒకింత అసహనం వ్యక్తం చేస్తూనే, ‘గ్యాప్ ఏమీ లేదు.. అది మీరు సృష్టించిందే..’ అని తేల్చేశారు ఈటెల రాజేందర్. ఈటెల వివరణతో, గులాబీ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.
అయితే, ఈటెల మాత్రం పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఒకింత అసహనంతో వున్నారనే విషయం.. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ఏ చిన్న అలజడినీ తట్టుకునే పరిస్థితుల్లో లేని గులాబీ అధిష్టానం, ఈటెల విషయంలో ఆచి తూచి స్పందిస్తోంది. ఈటెలపై చర్యలు తీసుకునేంత సాహసం టీఆర్ఎస్ అధిష్టానం చేయలేదు గనుకనే, ఈటెల తనదైన స్టయిల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.