అలులేదు, సులులేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తయారైయ్యింది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. అసలు రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే కింద మీద పడుతూ, పార్టీలో అంతర్గత గొడవలను సరిచేసుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, 2023 ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని మంత్రి పదవులు దక్కుతాయంటూ లెక్కలు వేసుకుంటున్నారు, అదేదో వ్యక్తిగత సమావేశంలో, పార్టీ ఆఫీస్ లో అయితే సరేలే ఎదో సరదా కోసం అనుకోవచ్చు, ఏకంగా బహిరంగ వేదిక మీదే మాట్లాడుకోవటం చూస్తుంటే టి- కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటో అర్ధం కాకపోగా జాలేస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణికం టాగోర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి గెలిస్తే క్యాబినెట్ లో మంత్రి పదవి ఖాయమంటూ చెప్పాడు. దీనితో ఇక ఉబ్బరం ఆగని జగ్గారెడ్డి మైక్ తీసుకోని నా ఒక్కడికే కాదు, గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ రాజనరసింహం, గీత రెడ్డి లాంటి వాళ్ళకి కూడా అవకాశం వస్తుందని చెప్పాడు. దీనితో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి సంగారెడ్డి నుండి ఏకంగా ఐదు మంత్రి పదవులు రాబోతున్నాయంటూ చెప్పాడు. దీనితో మరోసారి మైక్ తీసుకున్న జగ్గారెడ్డి ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో పదికి పది స్థానాలు కైవసం చేసుకుంటే పది మంత్రి పదవులు ఖాయమని చెప్పటంతో వింటున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎదో ఇంచార్జి కొంచం నేతల్లో ఉత్సహం నింపాలని ఉద్దేశ్యంతో జగ్గారెడ్డికి మంత్రి పదవి అంటే, ఏకంగా పది మంత్రి పదవులు మాకే అని, “తనతో” వున్నా సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవులు కావాలని కోరటం చూస్తుంటే అసలు వాళ్ళ ఆలోచన ఏమిటో అర్ధం కావటం లేదు. కేవలం పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపటానికి ఆ విధంగా అన్నారో లేక, మరేదైనా కారణముందో తెలియటం లేదు.
టి కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలు చాలా ఎక్కువ, ఇప్పుడు జగ్గారెడ్డి అడిగిన విధానం చూస్తే, తన వర్గానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవులు కావాలని కోరుకున్నాడు తప్పితే, పార్టీలోని సీనియర్ నేతలకు మంత్రి పదవులు అనే ఒక్క మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. ఇప్పట్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అసలు లేదు. అప్పటికి పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ, పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి, గెలిచిన తర్వాత మాకు మంత్రి పదవులు కావాలి, మా వాళ్ళకి కావాలని మాట్లాడుకోవటం ఏమిటో కాంగ్రెస్ సీనియర్ నేతలకే తెలియాలి. పదవుల పందేరం కావాలని కళలు కంటూ, ఇదే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 2023 కి కాదుకదా 2033 కి కూడా అధికారంలోకి రావటం అసాధ్యం. ముందు కలిసికట్టుగా తెరాస ని ఎలా ఓడించాలో అనే దానిపై దృష్టి పెట్టి, ఆచరణ మొదలుపెడితే నయం, లేకపోతే ఇలాంటి పగటి కలలే కంటూ ఒకరివెనకాల ఒకరు గోతులు తీసుకుంటూ బ్రతకాల్సిందే..