ఎన్ని నేరాలు చేసి ఉంటే అంత పాపులారిటీ. ఎన్ని కేసులు మీద ఉంటే అంత పబ్లిసిటీ. ఎంత దౌర్జన్యం చేయగలిగితే అంత పెద్ద విజయం. ఇది మన దేశ రాజకీయాల్లో రాజ్యమేలుతున్న విష సంస్కృతి. చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఎంతో మంది నేతలు తమపై ఉన్న కేసులను సాగదీస్తూ ఎదేచ్చగా పదవుల్లో కొనసాగుతున్నారు. అలాంటి నేతల కేసులను త్వరితగతిన పరిష్కరించి నేరారోపణలు రుజువైతే శిక్ష విధించడంతో పాటు రాజకీయాల నుండి నిషేదించాలని చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ డిమాండ్ ఇన్నాళ్ళకు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయాల్లో గొప్ప సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నాయి.
ఇప్పటికే నియమించిన అమికస్ క్యూరీ ద్వారా అన్ని హైకోర్టుల నుండి నేతలపై ఉన్న కేసుల వివరాలను తెప్పించుకున్న సుప్రీం కోర్టు ఆ కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని హైకోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 9 అంశాలను చేర్చాలని తెలిపింది. ప్రతి జిల్లాలోని పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరు, పరిష్కారానికి పట్టే సమయాన్ని, కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలను పొందుపర్చాలని సూచించింది.
స్టే విధించబడిన కేసులను రెండు నెలల్లో పరిష్కరించాలని తెలిపింది. అవసరమైతే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం సైతం రెండు నెలల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయగలమని సుప్రీం కోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి అమలులో వేగం చూస్తుంటే అతి త్వరలోనే నేర చరిత కలిగిన నేతలకు టైమ్ దగ్గరపడినట్టు అర్థమవుతోంది. ఈ నూతన పరిణామంతో ఇన్నాళ్లు చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్న నేర చరిత కలిగిన నేతలను ఇకపై ఎవ్వరూ కాపాడలేరని అనిపిస్తోంది.