తెలంగాణా: ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించడంతో తెలంగాణ నేతల్లో ఆందోళన నెలకొంది. కేసులు నిరూపణ జరిగితే పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని గాబరా చెందుతున్నారు. కేసులు నమోదైన వారిలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉండడంతో అందరిలో ఒకటే టెన్షన్.
దేశంలో ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ ఏళ్ళ తరబడిగా సాగుతుండడం, కోర్టుల్లో భారీగా పోగుపడి ఉండడంతో.. సుప్రీం దీనికి చెక్ పెట్టాలని భావించింది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. దేశంలో 4,859 కేసులు తెలంగాణలో 143కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం.
సుప్రీం ఆదేశాలతో నాంపల్లి సెషన్స్ కోర్టు రోజువారీ విచారణను సోమవారం షురూ చేసింది. విచారణకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నేరెళ్ల టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.
అయితే ఇప్పుడందరి దృష్టి రేవంత్ రెడ్డిపైనే ఉంది. సీఎం కేసీఆర్తో ఢీ అంటే ఢీ అనే రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి “హస్త” పార్టీ రేఖలు మారుద్దామనే తలంపుతో ఉన్నారు. కాకలు తీరిన నేతలున్న కాంగ్రెస్లో సీఎం కుర్చీ దిశగా సాగిపోవాలని చూస్తున్నారు. మరి కేసులు కొట్టేస్తారా లేదా మెడకి చుట్టుకుంటాయా అనేది విచారణలో తేలనుంది. కేసులు నిరూపితమైతే రేవంత్ పొలిటికల్ ఫ్యూచర్కు ఇబ్బందులు తప్పక పోవచ్చు.. ఎప్పుడు దొరికిపోతాడా అని ఎదురుచూస్తున్న అధికార పార్టీకి ఎదురుదాడి చేసే మంచి చాన్స్ లభించినట్లవుతుంది. రేవంత్ కేసుల విషయాన్ని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టవచ్చు.. ఏదేమైనా ఫాస్ట్ ట్రాక్ కేసుల విచారణ రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయోనని అందరిలో ఆసక్తి నెలకొంది.