తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం తమిళ సిని పరిశ్రమలోనే కాదు, తెలుగు, హిందీ భాషల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ వున్న నటుడు. కేవలం నటుడు మాత్రమే కాదు, అంతకు మించి.. అనేలా అతని ఫాలోయింగ్ కనిపిస్తుంటుంది.
ఇంతకీ రజనీకాంత్‌కి ‘మళ్ళీ’ ఏమైంది.? నిన్న సాయంత్రం వున్నపళంగా ఆయన్ని ఆసుపత్రికి తరలించారన్న వార్త బయటకు పొక్కగానే, ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. రజనీకాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
కొన్నాళ్ళ క్రితం ‘అన్నాత్తై’ (తెలుగులో ‘పెద్దన్న’) సినిమా షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైతే, ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్య సమస్యల వల్లనే, రాజకీయ పార్టీ పెట్టాలనుకుని చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేసి వుండాల్సిందే.
‘అన్నాత్తై’ సినిమా ప్రమోషన్లు జోరందుకున్న వేళ, సినిమా విడుదలకు సిద్ధమైన తరుణంలో రజనీకాంత్ అనారోగ్యం బారిన పడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, సాధారణ చెకప్ నిమిత్తం మాత్రమే రజినీకాంత్ ఆసుపత్రిలో చేరారని రజనీ సన్నిహితులు చెబుతున్నారు.
రక్తపోటు (బీపీ) కంట్రోల్ అవడంలేదనీ, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయనీ, మెదడులో నరాలు బలహీనంగా మారాయనీ ఇంకో ప్రచారం బయటకు వచ్చింది. రజనీకాంత్ తెరపై ఎంత ఈజ్‌తో కనిపిస్తారో అందరికీ తెలిసిందే. కానీ, సినిమా వేరు.. నిజ జీవితం వేరు.
తన అనారోగ్యం గురించి తనకు బాగా తెలుసు కాబట్టే, రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ ఆలోచనల్ని విరమించుకున్నారు. మరి, ఇప్పుడు ‘సినిమా ఒత్తిడి’ కారణంగానే రజీనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారా.? ఇంకేమన్నా కారణాలున్నాయా.? ఏమో, మరి.. ఆయనకే తెలియాలి.