కరోనా తాకిడికి వారు వీరు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ జనం అల్లాడిపోతున్నారు. వైద్యం అందాకా, ఆక్సిజన్ దొరక్క రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయేలా ఉంది భారత్ పరిస్థితి. ప్రభుత్వాలు శాయశక్తులా పోరాడుతున్నా పరిస్థితులు కంట్రోల్ కావట్లేదు. కొందరు పిల్లలు తండ్రిని ఇంకొందరు తల్లిని కోల్పోతుంటే తల్లీ తండ్రి ఇద్దరినీ కోల్పోయినవారు అనేకమంది ఉన్నారు. కళ్ళ ముందే కన్నవారి ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపొయిన పిల్లలు అనేకమంది.
అనాథలుగా మారిన ఆ పేద పిల్లలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. అందుకే కొందరు ముందడుగేసి ఆ పిల్లల బాధ్యతలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడ అదే పని చేస్తున్నారు. ఈ కష్టకాలంలో చిన్నారులెవరైనా కోవిడ్ కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయితే.. వారి బాధ్యతలను నేను, నా టీమ్ తీసుకుంటాం. వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. రెండు సంవత్సరాల పాటు వారికి తిండి, చదువు, అవసరమైన వాటినన్నింటిని సమకూర్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా నిలబడాలి అంటున్నారు. అనాథలైన పిల్లల వివరాలు తనకు తెలియజేయమని అందుతున్నారు. ఇలాంటి విపత్కర స్థితిలో సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆయన్ను అభినందించి తీరవలసిందే.