Kattappa Satya Raj : చిన్నా చితకా పాత్రలతో పరిచయమై, తమిళ నాట సూపర్ స్టార్‌గా ఎదిగిన హీరో ఆయన. అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోల తర్వాతి స్థానం ఆయనదే అంటారాయన. అలాంటిది ఒకానొక సమయంలో హీరోగా అవకాశాలు తగ్గేసరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తారు.
ఆయన ఎవరో కాదు, కట్టప్ప సత్యారాజ్. హీరోగా దాదాపు 100కు పైగా సినిమాలు చేసినా దక్కని పాపులారిటీ, కేవలం ఒకేఒక్క సినిమాతో దక్కించుకున్నారాయన. అదే ‘బాహుబలి’ సినిమా. ఈ సినిమాతో కట్టప్పగా ఆయన పొందిన అభిమానానికి ఆకాశమే హద్దు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయారు కట్టప్పగా సత్యరాజ్.
సత్యరాజ్ మంచి నటుడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే అప్పటికప్పుడే 30 ఏళ్ల కొంటె కుర్రాడిలా మారిపోగలడు. అరవయ్యేళ్ల ఒంటరి ముసలాడిగానూ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోగలడు. అందుకేగా సత్యారాజ్‌కి అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ అంత మంచి పేరుంది.
‘శంఖం’ సినిమాతో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన సత్యారాజ్, ‘మిర్చి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత ‘బాహుబలి’తో కట్టప్పగా సరికొత్త నామకరణం చేయించుకున్నారు ప్రపంచం దృష్టిలో. నటుడిగానే కాదు, వ్యక్తిత్వం పరంగానూ సత్యరాజ్ కొన్ని ప్రత్యేకతలు కలిగి వున్నారు.
ఖాళీ సమయం దొరికితే, పుస్తకాలు ఎక్కువగా చదువుతారట. ఒకవేళ ఖాళీ లేకపోయినా సరే, కుదుర్చుకుని మరీ బుక్స్ రీడింగ్‌పై ఆసక్తి చూపిస్తారట ఆయన. స్వతహాగా జమీందార్ బిడ్డ అయిన సత్యారాజ్, కొన్ని కారణాలతో ఆస్థుల్ని పోగొట్టుకోవల్సి వచ్చిందట. అలా మిడిల్ క్లాస్ లైఫ్‌లో కనబడే కష్టాలన్నీ తన జీవితంలోనూ అనుభవించాననీ ఆయన చెబుతారు.
ఆరవ తరగతి నుంచే సినిమాలపై విపరీతమైన పిచ్చి పెంచేసుకున్నారట. అదే టార్గెట్‌గా ఎదుగుతూ వచ్చారట. కానీ, ఇంట్లో వాళ్లకి ఆయన సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట. దాంతో ఇంట్లోంచి బయటికి వచ్చేసి, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ మొదటి సినిమా ఛాన్స్ కోసం ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావని సత్యరాజ్ చెప్పడం విశేషం.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అనే ప్రశ్నకి సమాధానం కోసం ప్రేక్షకులు ఎంత కష్టపడి ఎదురు చూడాల్సి వచ్చిందో.. అంత కన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందట సత్యారాజ్ నటుడిగా ఇండస్ర్టీలో నిలదొక్కుకోవడానికి.