ఆ 1,158 ఖాతాలను తక్షణమే ఆపేయండి: ట్విట్టర్‌కు కేంద్రం వార్నింగ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల ఉద్యమం గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సమాచారం విషయంలో చర్యలు తీసుకోవాలని, అటువంటి ఖాతాలను నిలిపివేయాలని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు కేంద్రం ఇప్పటికే సూచించింది. తాజాగా, మరిన్ని ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది.

 

పాకిస్థాన్, ఖలిస్థానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న 1,178 అకౌంట్లను తక్షణమే నిలిపివేయాలని ట్విటర్‌ను కేంద్రం ఆదేశించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. హోంశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ట్విటర్‌ ఇంకా స్పందించలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

‘ఖలీస్థాన్ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతుతో విదేశీ భూభాగాల నుంచి పనిచేసే ఉగ్రవాదులకు చెందిన చాలా ఖాతాలు రైతుల నిరసనలపై తప్పుడు సమాచారం.. రెచ్చగొట్టే విషయాలను పంచుకోడానికి ఉపయోగిస్తున్నారు’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 257 ఖాతాలను ట్విట్టర్ పునరుద్ధరించిన నేపథ్యంలో కేంద్రం ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.  సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలా తప్పుడు సమాచారం చేరవేసే ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని గతవారం ట్విటర్‌ను ఆదేశించింది.