Janasenani : ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సాయం చేయడాన్ని స్వాగతించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ విషయంలో జనసేన అధినేతను రాజకీయంగా విమర్శించడంలో అర్థమే లేదు.
అయితే, మంచి పని చేస్తూనే.. గందరగోళం రేకెత్తించే రాజకీయం చేస్తున్నారు జనసేనాని. తన వ్యూహంపై జనసేనానికి ఖచ్చితమైన అభిప్రాయం, బోల్డంత నమ్మకం వుంటే వుండొచ్చుగాక. కానీ, జనసైనికుల పరిస్థితేంటి.? వచ్చే ఎన్నికల్లో జనసేనతోపాటు ఇంకెన్ని జెండాలు తమ భుజాన మోయాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న జనసైనికులకు ఆయన ఏం సంజాయిషీ ఇస్తారు.? వారినెలా ఓదార్చుతారు.?
వైసీపీని ఓడించడానికి, అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి రావాలని జనసేనాని పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లోనే జనసైనికులు, టీడీపీ జెండా అలాగే బీజేపీ జెండాని కూడా తమ భుజాన మోశారు. ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీల జెండాల్ని కూడా జనసైనికులు మోయాల్సి వచ్చింది.
ఇంతా చేస్తే, అధినేత పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు. 2014 ఎన్నికల్లోనే జనసేనాని తప్పు చేశారనీ, అప్పుడే జనసేన పార్టీ పొత్తుల దిశగా అడుగులేసి, చట్ట సభలకు తాను వెళ్ళడంతోపాటు, జనసేన పార్టీ నుంచి మరికొంత మందిని చట్ట సభలకు తీసుకు వెళ్ళి వుంటే బావుండేదన్న భావన జనసైనికుల్లో ఇప్పటికీ వ్యక్తమవుతోంది.
వైసీపీని దించాలన్న జనసేన ఆలోచనని రాజకీయంగా తప్పు పట్టలేం. కానీ, దాని వల్ల జనసేనకీ రాజకీయంగా లాభముండాలి కదా.? ఈ విషయమై జనసైనికులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి జనసేనానికి వస్తే.?