ఎస్పీ బాలు.. పాట బతికినంతకాలం.. పాటలోనే వుంటారు.!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మావాడు.. అని తమిళ సినీ ప్రేక్షకులు.. కాదు, మావాడు.. అని తెలుగు సినీ ప్రేమికులు.. మధ్యలో, ‘మావాడు కూడా..’ అని బాలీవుడ్.. ఇలా దాదాపుగా అన్ని సినీ పరిశ్రమలూ ఆయన్ని సొంతం చేసుకున్నాయి. సినీ పరిశ్రమలూ, ప్రేక్షకులూ.. ఎస్పీ బాలుపై తమకున్న అభిమానాన్ని ఇంకోసారి ప్రత్యేకంగా చాటుకున్నాయి. నేడు, ఎస్పీ బాలు వర్ధంతి. ఆయన ఇప్పుడు మన మధ్య లేరన్న భావన ఎవరికీ లేదు. ఎందుకంటే, ఎస్పీ బాలు టీవీల్లో అలా కనిపిస్తున్నారు.. వినిపిస్తున్నారు మరి. పాటకి మరణం వుండదు. ఆ పాటని అమృతంలా తమ గాత్రంతో మలచిన ఎస్పీ బాలుకి అసలే మరణం లేదు. ఎస్పీ బాలు గత ఏడాది కరోనా కారణంగా మృతి చెందిన విషయం విదితమే. కరోనా సోకినా తాను త్వరగా కోలుకుంటానని, ఆ కరోనా వైరస్‌ని జయిస్తాననీ ఎస్పీ బాలు చెప్పారు.

వైద్య చికిత్స మొదలైన తొలి రోజుల్లో ఆయన చాలా ధైర్యంగా వున్నారు. కానీ, ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంతలా ప్రయత్నించినా ఎస్పీ బాలు కోలుకోలేకపోయారు. ‘ఎస్పీ బాలు కోలుకుంటున్నారు..’ అనే వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా పాండమిక్ అప్పటికి తీవ్రస్థాయిలోనే వున్నా, చాలామంది అభిమానులు.. ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. ఎస్పీ బాలు తెలుగువారు.. ఆయన తమిళంలోనూ పాటలు పాడారు.. హిందీలోనూ పాటలు పాడారు. అక్కడా ఇక్కడా.. అన్ని చోట్లా అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఎస్పీ బాలు అంటే ఓ వ్యక్తి కాదు.. శక్తి. ఆయన పాటలకున్న శక్తి అలాంటిది. భారతీయ సినీ పరిశ్రమకీ, భారతీయ సినీ సంగీతానికీ ఎస్పీ బాలు ఓ కలికుతురాయి. ఆయన్ని స్మరించుకోవడమే ఓ భాగ్యం.. అని వివిధ సినీ పరిశ్రలమకు చెందిన సినీ ప్రముఖులు బాలు వర్ధంతి సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.. బాలుకి ఘనంగా ఇంకోసారి నివాళులర్పిస్తున్నారు.