తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. సీనియర్ నేతలు సహకరించకపోయినా సొంత ఎజెండాతో దూసుకుపోతున్నారు. కేసీఆర్ ను పడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పార్టీలోని వీహెచ్, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ లాంటి సీనియర్ నేతలు ఆవేశంతో పనులు కావని, ఆలోచన ఉండాలని వెనకడుగు వేస్తున్నా తనను వెనక్కు లాగుతున్నా రేవంత్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు. ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పేరు వార్తల్లో ఉంది అంటే అది రేవంత్ రెడ్డి చేసిన పనుల ఫలితమే అనాలి. ఎమ్మెల్యేగా ఓడినా ఎంపీగా గెలిచి తన ఫాలోయింగ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న రేవంత్ పడిలేచిన కెరటంలా విరుచుకుపడుతున్నారు. ఇదే హైకమాండ్ వద్ద ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.
ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ పదవిలో కొత్త వ్యక్తిని కూర్చోబెట్టాలని భావిస్తోంది. రానున్న ఎన్నికల్లో పుంజుకోవాలంటే కొత్త నాయకత్వం అవసరమని సోనియా, రాహుల్ బలంగా నమ్ముతున్నారు. అందుకే చీఫ్ పదవికి సమర్థవంతమైన వ్యక్తిని వెతుకుతున్నారు. అయితే రాహుల్ మనసులో రేవంత్ రెడ్డి పేరే ఉందని అంటున్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ దూకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పనితనం బాగా నచ్చాయి. అందుకే చీఫ్ పదవి కోసం సీనియర్ నేతలు కాచుకుని ఉన్నా రేవంత్ రెడ్డి పేరునే ప్రతిపాదిస్తున్నారట. మొన్నటివరకు ఆయనే ఫైనల్ అనుకుంటుండగా అనూహ్యంగా మరొక పేరు తెరమీదకు వస్తోంది.
ఆ పేరే ఎమ్మెల్యే సీతక్క. ముగులు ఎమ్మెల్యే అయిన దనసరి అనసూయ అలియాస్ సీతక్కకు ప్రజల్లో మంచి పేరుంది. ప్రజాఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చిన సీతక్క ఎమ్మెల్యే అయినప్పటి నుండి కనబరచిన పనితీరు అద్భుతం. పార్టీలో పదవుల కోసం జరిగే కోట్లాటల్లో ఏనాడూ తలదూర్చని సీతక్క ప్రజాసేవలో మాత్రం అందరికంటే ముందే ఉంటారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన స్థానం కల్పించింది స్వయంగా సోనియా గాంధీనే. లాక్ డౌన్ సమయంలో సీతక్క ప్రజల కోసం పనిచేసిన తీరు చాలా గొప్పది.
సోనియా గాంధీ ఇచ్చిన స్పూర్తితోనే ఇదంతా చేస్తున్నానని అంటుంటారామె. సోనియాకు సీతక్క అంటే అభిమానం, నమ్మకం రెండూ ఉన్నాయి. ప్రజల్లో ఆమెకు బోలెడంత గొప్ప పేరు ఉంది. అందుకే చీఫ్ పదవికి సోనియా గాంధీ సీతక్క పేరును పరిశీలిస్తున్నారట. సోనియా గాంధీ మాటకు రాహుల్ సహా పార్టీలో ఎవ్వరూ అడ్డుచెప్పరు. కాబట్టి హైకమాండ్ చీఫ్ పదవికి సీతక్కకే ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.