సోము వీర్రాజుకి ‘అమరావతి’ ఝలక్.! ఇలా జరిగిందేంటబ్బా.?

రాజధాని అమరావతి గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి షాక్ తగలడం. ‘రాజధాని అమరావతి మీ వల్లే నాశనమైంది..’ అంటూ ఓ వృద్ధుడు అమరావతిలో సోము వీర్రాజుని నిలదీశారు.

‘అమరావతిని వైసీపీతో కలిసి మీరే దెబ్బతీశారు.. ఇప్పుడు మీరే పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. మీ పార్టీ అధికారంలో వున్న కేంద్రం ఒకలా మాట్లాడుతోంటే, మీరు తెరవెనుకాల మద్దతిస్తోన్న వైసీపీ ఇంకోలా మాట్లాడుతోంది.. ఇద్దరూ కలిసి అమరావతిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.. మీరు మాత్రం, అమరావతిలో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు..’ అంటూ ఓ వృద్ధుడు నేరుగా సోము వీర్రాజునే నిలదీయడం గమనార్హం.

ఊహించని ఈ షాక్‌తో కొంత విలవిల్లాడారు సోము వీర్రాజు. కాస్సేపటి తర్వాత తేరుకున్నారు. చంద్రబాబు గనుక నరేంద్ర మోడీతో 2019 ఎన్నికల వరకూ కలిసే వుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదనీ, వైసీపీకి 151 సీట్లు వచ్చి వుండేవి కాదని ఆ తర్వాత వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో అమరావతికి కేంద్రం బోల్డన్ని నిధులు ఇచ్చేసిందని చెప్పుకుంటూ బీజేపీ చేసిన పబ్లిసిటీ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేంద్రం పర్యవేక్షణలోనే రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమయ్యింది.. కానీ, కేంద్రం ఆ తర్వాత అమరావతిని పట్టించుకోలేదు.

‘ఢిల్లీని తలదన్నే నగరంగా అమరావతి..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు, అమరావతి శంకుస్థాపనలో. కానీ, కేంద్రం.. ఆ తర్వాత అమరావతిని పట్టించుకోలేదు సరికదా, చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ వచ్చింది. ఫలితం అనుభవించాలి కదా మరి.!