తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ‘రెబల్‌స్టార్’ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కృష్ణం రాజు. అప్పటికే ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఉన్నా…వారితో పోటీ తట్టుకుని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు కృష్ణం రాజు. అందర్నీ షాక్ కి గురిచేస్తూ ఆయన సెప్టెంబర్ 11న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. చివరగా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రంలో కనిపించారు.
అయితే కృష్ణంరాజు వ్యక్తి జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కృష్ణంరాజుకు శ్యామలదేవి కంటే ముందే సీతాదేవితో పెళ్లి జరిగింది. కోట సంస్థానాధీశు వంశస్తులు రాజా కలిదిండి ప్రసాద వరహా వెంకట సూర్యనారాయణ కుమారలక్ష్మీ కాంత రాజ బహుద్దూర్, సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని కృష్ణంరాజు 1969లో వివాహం చేసుకున్నారు.
దురదృష్టవశాత్తు కృష్ణం రాజు మొదటి భార్య సీతాదేవి 1995లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. 1996లో తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలదేవితో కృష్ణంరాజుకు రెండో పెళ్లి చేశారు. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటుంది.