వైసీపీ ఎంపీల్లో కొడాలి నాని తీరే సపరేటు. ఆయన ఏం మాట్లాడినా ఎదుటివారిని కొట్టినట్టు, తిట్టినట్టు ఉంటుందే తప్ప సామరస్యం అనే మాటే ఉండదు. ప్రతి విషయం మీద తమ ప్రభుత్వానిది తప్పేమీ ఉండదన్నట్టు మాట్లాడతారు. ఎవరు జగన్ సర్కారును నిలదీయడానికి ట్రై చేసినా వారి మాటల్లో పసేమీ లేదని, అసలు వారి వ్యాఖ్యలు వినాల్సిన అవసరం తమకు లేదని అనే కొడాలి నాని తాజాగా నడుస్తున్న హిందూ దేవాలయాల మీద దాడుల అంశం మీద కూడ అలాగే మాట్లాడారు.
హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.. మీరేమంటారు అంటే అసలు దేవాలయాల మీద దాడులు జరిగితే వైసీపీకి వచ్చే లాభమేమిటి, మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు అన్నట్టు నాని మాట్లాడారు. అంతవరకు బాగానే ఉన్నా ఆతర్వాత వదిలిన ఆణిముత్యాలే వివాదాస్పదంగా ఉన్నాయి. అసలు రోడ్డు పక్కన గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి చేయి విరిగితే ఆ గుడికి, ఆంజనేయుడీకీ వచ్చే నష్టమేమీ ఉండదు, దుర్గ గుడిలో నాలుగైదు లక్షల వెండిపోయే ఆ డబ్బుతో మేడలు మిద్దెలు కట్టేది లేదు, అంతర్వేదిలో కోటి రూపాయల రథం తగలబడితే ప్రభుత్వం చేయిస్తుంది దేవుడికి పోయేదేం లేదు.. ఇది ఎవరికి లాభం బీజేపీ, టీడీపీ, జనసేనలకి తప్ప అంటూ మాట్లాడారు.
ఆయన మాటలు విన్న జనం మంత్రిగారు ధ్వంసమైన వివ్రహాలను, పోయిన నాలుగైదు లక్షల వెండిని, తగలబడి బూడిదైన రథం విలువ కోటి రూపాయలను చూస్తున్నారే తప్ప వాటి వెనకున్న కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను పట్టించుకోరా. అసలు సమస్యే హిందూ మతం మీద దాడి జరుగుతోందని, దాని గురించి మాట్లాడకుండా విరిగింది సిమెంట్ విగ్రహం చెయ్యే కదా, పోయింది 10 కిలోల వెండే కదా, తగలబడింది కోటి రూపాయల రథమే కదా అంటూ సినీ పక్కీలో మాట్లాడటం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.