వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంత బిజీగా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. పూర్తి సమయాన్ని పాలనకే కేటాయిస్తున్నారు ఆయన. నిత్యం అధికారులతో సమావేశాలు, సమీక్షలు జరుపుతూ సంక్షేమ కార్యక్రమాల అమలుకోసం పాటుపడుతున్నారు. మిగిలిన కొద్దిపాటి సమయాన్ని పార్టీ వ్యవహారాల కోసం వెచ్చిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీ పరిస్థితే బాగోలేదట. కారణం.. వారికి సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదట. గెలిచి అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమ నాయకుడిని కలిసే అవకాశం చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు దొరకలేదు.
ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు జగన్‌ను కలవలేకపోయిన ఎమ్మెల్యేలు వైసీపీలో చాలామండే ఉన్నారట. ఎంత గొప్ప పాలన అయినా నియోజకవర్గాల్లో సమస్యలు, సంగతులు ఎమ్మెల్యేలు చెప్పనిదే ఏ ముఖ్యమంత్రికైనా తెలిసే ప్రసక్తే లేదు. ఎంత నెట్వర్క్ ఉన్నా ఎమ్మెల్యేల ద్వారానే కొన్ని పనులు అవుతాయి. అందుకే ఎమ్మెల్యేలు ఒక్కసారైనా జగన్‌ను కలిసి తన నియోజకవర్గ సమస్యలను, అవసరాలను, పార్టీ పరమైన విషయాలను చెప్పుకోవాలని అనుకుంటున్నారట. ముఖ్యమంత్రిని కలవడానికి ఎన్నోమార్లు ట్రై చేశారట.
కానీ జగన్‌ను కలవలేకున్నారట. కారణం సీఎం చుట్టూ ఉన్న కోటరీ. జగన్‌కు అత్యంత సన్నిహితమైన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగాం సురేష్ లాంటి ఒక 10 మంది నేతలే ఈ కోరాతీలో ఉంటారు. వీరిని దాటాకే జగన్ వద్దకు వెళ్లగలరట. ఇప్పటివరకు తమకు వీరి వరకు వెళ్లడమే వల్లకాలేదంటే ఇక సీఎంను కలవడం కలలో పనేనని అనుకుంటున్నారు ఎమ్మెల్యేలు. గతంలో కూడ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ చుట్టూ కోటరీ ఉందని, దాన్ని దాటి వెళ్లడం తన వలనే కాలేదని, జగన్ కొంచెం పెద్ద మనసు చేసుకుని కలిసే అవకాశమా ఇవ్వాలని పదే పదే చెప్పి చివరికి అడ్డం తిరుకున్న సంగతి తెలిసిందే.