తెలుగుదేశం ఆశాకిరణం నారా లోకేష్ ఈమధ్య కొంచెం యాక్టివ్ అయ్యారు. అజ్ఞాతవాసం ముంగించి జన సమూహంలోకి దిగారు. దీంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. లోకేష్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార పక్షం మీద విమర్శలు, సవాళ్లు విసురుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన అడుగు పడటంతో నియోజకవర్గం భగ్గుమంది. అదే అనంతపురం జిల్లా శింగనమల. వర్షాలకు అక్కడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో లోకేష్ పరామర్శకు వెళ్లారు. భవిష్యత్ నాయకుడు వస్తున్నాడని నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి.
చిన్నా చితకా నేతల దగ్గర్నుండి బడా లీడర్ల వరకు అందరూ లోకేష్ చుట్టూ చేరిపోయి ఆయన పర్యటనకు కళ తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ రావాల్సిన ముఖ్యమైన వ్యక్తి మాత్రం లోకేష్ పర్యటనకు రాలేదు. ఆ వ్యక్తే నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి. గత ఎన్నిక ల్లో పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిన ఆమెకు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి ఆమెను పార్టీకి దూరం చేయాలని ఒక వర్గం బలంగా ట్రై చేస్తోంది. అందుకే గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం, సమాచారం అందడంలేదు. తాజాగా లోకేష్ పర్యటనకు వచ్చిన విషయం కూడ ఆమెకు అధికారికంగా ఎవ్వరూ చెప్పలేదట.
దీంతో లోకేష్ వచ్చారని తెలిసినా ఆమె ఆయన్ను కలవలేదు. దీంతో పార్టీ పట్ల ఆమె అసంతృప్తి ఉందో బయటపడింది. జిల్లా నేతలు ఇంఛార్జ్ అయిన తనను కాదని మరొక వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారని బండారు శ్రావణి గత కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని ఎలా వ్యక్తపరచాలో ఇన్నాళ్లు అర్థంకాని ఆమె లోకేష్ పర్యటనతో అవకాశం రావడంతో బయటపెట్టారు. ఈ పరిణామంతో శింగనమల టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీని కలపడం ఎలాగో తెలియక జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇదే చీలిక ఇంకొన్నాళ్ళు కొనసాగితే పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆందోళనపడుతున్నారు క్యాడర్.