రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ అభ్యర్థి..!

దేశంలో వాహనదారుల సంఖ్య రోజుకి పెరిగిపోవటం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా ఎంతోమంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల తీవ్ర గాయాలపాలై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాలలోకి వెళితే…. ఆంజనేయులు అనే యువకుడు ఇటీవల ఎస్సై పోటీ పరీక్షలలో పాల్గొని దుందిగల్ మర్రి లక్ష్మ రెడ్డి కళాశాలలో పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం పై కళాశాల నుండి షాపూర్ నగర్ వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుండి వేగంగా వస్తున్న ట్యాంకర్ లారీ వెనుక నుంచి వచ్చి ఆంజనేయులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆంజనేయులు ద్విచక్ర వాహనం నుండి క్రింద పడటంతో లారీ చక్రాలు అతని తలపై నుండి వెళ్లాయి. దీంతో ఆంజనేయులు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఆంజనేయులు హెల్మెట్ ధరించినప్పటికీ మృతి చెందాడు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో మరణించిన ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు మరణించిన వార్త అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అదే రోజు ఆంజనేయులు సోదరుడి వివాహం ఉన్నా కూడా ఎస్సై కావాలన్నా సంకల్పంతో పరీక్ష రాయటానికి వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడు. చేతికి అందిన కొడుకు ఇలా పరీక్ష రాయటానికి వచ్చి మరణించడంతో ఆంజనేయులు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.