ఏ హీరోకి అయినా ఒక ఫిక్స్డ్ మార్కెట్ రేంజ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టే నిర్మాతలు ఆ హీరో సినిమా మీద బడ్జెట్ పెడుతుంటారు. పక్కగా ప్రణాళిక వేసుకుని ఖర్చు పెడితేనే కాస్తో కూస్తో లాభాలు చూసే అవకాశం ఉంటుంది నిర్మాతలకు. అలా కాదని ఎక్కువ కుమ్మరించేస్తే నష్టాలు తప్పవు. ఒక్కొక్కసారి అన్నీ చూసుకుని సినిమాను మొదలుపెట్టినా కూడ బడ్జెట్ పెరిగిపోతుంటుంది. సగం వరకు సినిమా ముగిశాక చేసేదేం లేక ఓవర్ బడ్జెట్ అయినా భరిస్తుంటారు నిర్మాతలు.
నాచ్యురల్ స్టార్ నాని కొత్త సినిమా విషయంలోనూ అదే జరుగుతోందట. నాని ప్రజెంట్ మూడు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ‘శ్యామ్ సింగరాయ్’ కూడ ఒకటి. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. నాని కెరీర్లోనే పెద్ద బడ్జెట్ సినిమా ఇది. పూర్తిగా కలకత్తా నేపథ్యంలో సాగే కథ ఇది. అందుకే మొత్తం అవుట్ డోర్ చిత్రీకరణే ఉంది. కోవిడ్ జాగ్రత్తల నేపథ్యంలో సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తమే ఖర్చవుతోందట. రోజువారీ ఖర్చులు డబుల్ అవుతున్నాయట. దీంతో బడ్జెట్ పెరిగిపోతోందట. సినిమా భారీ విజయాన్ని అందుకుంటే తప్ప పెడుతున్న మొత్తం వెనక్కు రావడం కష్టమనే టాక్ వినబడుతోంది సినీ వర్గాల్లో. చూడాలి మరి నాని నిర్మాతను ఎలా సేవ్ చేస్తారో.