Pushpa The Rule : ‘పుష్ప’ సినిమా రెండు పార్టులుగా డిజైన్ చేశారు. నిజానికి, తొలుత ఒకే సినిమాగా డిజైన్ చేసినా, ఆ తర్వాతే అది రెండు పార్టులయ్యింది. ఒకటి, ‘పుష్ప ది రైజ్’ పేరుతో ఇటీవల విడుదలైంది. రెండోది ‘పుష్ప ది రూల్’ పేరుతో రానుంది.
ఫిబ్రవరి నుంచి ‘పుష్ప ది రూల్’ పనులు ప్రారంభమవుతాయని దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ చెబుతోన్న విషయం విదితమే. అయితే, ‘పుష్ప ది రైజ్’ విడుదలయ్యాక, ‘పుష్ప ది రూల్’ విషయమై చిత్ర దర్శక నిర్మాతలు ఒకింత డిఫెన్స్‌లో పడిపోయారనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
‘పుష్ప’ సినిమాపై తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాల్లోనూ బజ్ బాగానే క్రియేట్ అయ్యింది.. విడుదలకు ముందు. కానీ, విడుదలయ్యాక.. వసూళ్ళ విషయంలోనే కొంత గందరగోళం వుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో, సినిమా ప్రమోషన్స్.. ఆయా భాషల్లో చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ సరిగ్గా జరగలేదన్న వాదనలూ లేకపోలేదు.
దీనికి తోడు, ‘పుష్ప’ సినిమాకి డే వన్ నుంచీ నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది.. అదింకా కొనసాగుతూనే వుంది. వసూళ్ళు.. రికార్డు స్థాయి వసూళ్ళని చెబుతున్నా, ‘అంత లేదు’ అనే చర్చ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప ది రూల్’ ఆషామాషీగా తీస్తే కష్టం. అందుకే, కాస్త టైమ్ తీసుకుని సినిమాని పట్టాలెక్కించాలనే ఆలోచనలో వున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.
ఏమో, ఇందులో నిజమెంతో.! ఆలస్యం అమృతం విషం.. సో, ఆలస్యం చేయడమంటే, ‘పుష్ప ది రూల్’ని అటకెక్కించేయడేమేనేమో.