AP On Cinema Tickets : సినిమా రగడ: ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ చర్చలు.!

AP On Cinema Tickets : సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ తరఫున తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందా.? అలా జరిగే చర్చల వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందా.? రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు.. ఓ అంశమ్మీద ఏకాభిప్రాయానికి రావడం సాధ్యమా.? తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాను మాట్లాడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతానికి తెలంగాణలో ‘బేస్’ ఏర్పాటు చేసుకుని వుంది. తమిళనాడులోని చెన్నయ్ నుంచి హైద్రాబాద్ వచ్చే క్రమంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొంది తెలుగు సినిమా.

చాలా ఏళ్ళుగా హైద్రాబాద్‌లో స్థిరపడ్డ తెలుగు సినిమా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవాలన్న దిశగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్ కోరుతోంది. టిక్కెట్ల రచ్చ నేపథ్యంలో ‘ఆంద్రప్రదేశ్ నుంచే 60 శాతం ఆదాయం తెలుగు సినిమాకి వస్తోంది..’ అంటూ పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలూ వ్యాఖ్యానిస్తున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తోందనీ, కరోనా నేపథ్యంలో ఇబ్బందులెదుర్కొంటోన్న తెలుగు సినీ పరిశ్రమ తిరిగి కోలుకోవడానికి తమవంతుగా మరింత సహకరిస్తామనీ, సినిమా పరిశ్రమపై వేలాది మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారనీ తలసాని వ్యాఖ్యానించడం గమనార్హం.

తలసాని వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తరఫున స్పందన ఎలా వస్తుందో ఏమో.!