Shyam Singha Roy : అవసరమా ఈ సమయంలో వివాదాల్ని కొనితెచ్చుకోవడం.? నిర్మాతలు ఏమైపోతారన్న కనీసపాటి ఇంగితం లేకుండా వివాదం రాజేశాడు నేచురల్ స్టార్ నాని. ‘నాని అన్నా మీ వెనకాల మేమున్నాం..’ అని అభిమానులు చెప్పొచ్చుగాక. కానీ, కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతని ఇబ్బందుల్లోకి నెట్టేయడం హీరో నానికి సబబు కాదు.
సినిమా టిక్కెట్ల వివాదంపై నాని స్పందించాడు. సినిమా థియేటర్లని కిరాణా దుకాణాలతో పోల్చాడు. ప్రేక్షకుల్ని ప్రభుత్వం అవమానిస్తోందంటూ, ఏపీలోని జగన్ సర్కారుపై గుస్సా అయ్యాడు. అంతే, వైఎస్సార్సీపీ మద్దతుదారులకు కోపమొచ్చింది. ‘బ్యాన్ శ్యామ్ సింగారాయ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని లేవదీసేశారు. నాని అభిమానులూ కౌంటర్ ఎటాక్ చేశారనుకోండి.. అది వేరే సంగతి.
సినిమా టిక్కెట్ల ధరలు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా వున్నమాట వాస్తవం. నగర శివార్లలోని థియేటర్లకూ తక్కువ ధరలకే టిక్కెట్లంటూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అయితే, ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యాలు వేరేగా వున్నాయి. ప్రచారంలో వున్న కలెక్షన్లకీ, వాస్తవ కలెక్షన్లకీ పొంతన లేకుండా పోయిందనీ, టిక్కెట్ల ధరల్ని పెంచేస్తుండడం వల్ల సామాన్యుడికి సినిమా భారంగా వుందనీ ప్రభుత్వం అంటోంది.
సరే, తప్పెవరిది.? అన్నది వేరే చర్చ. సినిమా పరిశ్రమ అంటే.. అద్దాల భవనం లాంటిదని సినీ జనాలే చెబుతుంటారు. చిన్నరాయి పడినా.. ఖరీదైన భవంతి కళావిహీనంగా తయారవుతుంది.. తీవ్రంగా నష్టపోతుంది కూడా.
అందుకే, ఇలాంటి విషయాల్లో సినీ జనాలు ఆచి తూచి వ్యవహరించాలి. ఒకవేళ ‘బ్యాన్ శ్యామ్ సింగారాయ్’ నినాదానికి సాధారణ సినీ ప్రేక్షకులూ మద్దతు పలికితే.. తద్వారా నిర్మాతకి కలిగే నష్టాన్ని నాని భర్తీ చేయగలడా.?