ఈరోజు శివరాత్రి సెలవు కావడం, రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో ఒకేసారి మూడు సినిమాలు రిలీజయ్యాయి. ‘శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్’ మూడు కూడ డీసెంట్ సినిమాలే. ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది అనడానికి లేదు. అన్నీ మంచి బజ్ ఉన్నవే. మూడూ సమానమైన హైప్ నడుమ రిలీజయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మార్నింగ్ షోలు పూర్తయ్యాయి. ప్రేక్షక వర్గాలు మూడు సినిమాలకు రిజల్ట్ చెప్పేశారు. ముందుగా శర్వానంద్ శ్రీకారం సంగతి చూద్దాం. చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే బలంగా ఉంది. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే సర్వా చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.
సినిమాలో అందరూ వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ, కష్టమని వదిలేస్తే ఎలా అనే కోర్ పాయింట్ సినిమా ఆరంభం నుండే ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఐటీ ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించే కుర్రాడు అన్నీ వదిలేసి సొంత ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తాను అంటాడు. అదేమో తండ్రికి అస్సలు నచ్చదు. కానీ ఆ కుర్రాడు వినడు. అష్టకష్టాలు పడి అసలు వ్యవసాయానికి తన అర్థం ఏమిటో చెప్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ కథ. వినగానే అటెంక్షన్ అందుకునే పాయింట్ ఇది.
సినిమాలో వ్యవసాయానికి హీరో చెప్పిన అర్థం బాగుంది. వ్యవసాయాన్ని కాపాడటానికి కథానాయకుడు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. డైరెక్టర్ కిశోర్ మంచి ఎమోషనల్ కంటెంట్, సీన్స్ చాలానే రాశారు. మొదటి సగభాగంలో మెండుగా ఉన్న ఇలాంటి సన్నివేశాలు ద్వితీయార్థంలో కొంత తగ్గాయి. అక్కడ కూడ అలాంటి సన్నివేశాలే ఇంకొన్ని ఉంటే బాగుండేది. సినిమా ముగింపులో ఇచ్చిన కంక్లూజన్ సంతృప్తికరంగానే ఉంది. ఇక శర్వానంద్, రావు రమేష్, సాయి కుమార్ లాంటి కీలక పాత్రదారుల నటన మీద ప్రశంసలు పడుతున్నాయి. మొత్తంగా సినిమా రెండవ సగం కాస్త డౌన్ అయినప్పటికీ మొత్తంగా మాత్రం ప్రేక్షకులకు ఫీల్ గుడ్ మూవీని చూసిన అనుభూతిని మాత్రం ఇస్తుందట.