కేటీయార్, హరీష్‌రావుపై షర్మిల సెటైర్ల వర్షం.!

Sharmila's Perfect Setires On KTR and Harish Rao!

Sharmila's Perfect Setires On KTR and Harish Rao!

పెట్రోల్ పోసుకున్నోడికి అగ్గిపెట్టె తెచ్చుకోవడం తెలియలేదా.? మీరు కదా, రెచ్చగొట్టి యువతని తెలంగాణ ఉద్యమంలో బలి చేసింది.? అంటూ మంత్రి హరీష్ రావుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీయార్ మీద అయితే, ‘పెద్ద మగాడు’ అంటూ సెటైర్లేశారు షర్మిల.

మీడియా సమావేశంలో షర్మిల, తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించీ, సోదరుడు వైఎస్ జగన్‌తో విభేదాలంటూ జరుగుతున్న ప్రచారం గురించీ, తెలంగాణలో నిరుద్యోగుల సమస్య గురించీ, రాజన్న రాజ్యం గురించీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయా నేతలపై విరుచుకుపడ్డారు.

కేటీయార్, మీరేదో వ్రతాలు చేసుకుంటున్నారని విమర్శించారు కదా.? అని పాత్రికేయులు ప్రశ్నిస్తే.. అసలు కేటీయార్ అంటే ఎవరు.? అని ప్రశ్నించిన షర్మిల, కేసీయార్ కొడుకు కేటీయార్ కదా.. అంటూ మొదలెట్టారు. తాను మహిళననీ, వ్రతమే చేస్తున్నానని కేటీయార్ తన మీద విమర్శలు చేస్తే చేయొచ్చనీ, నిరుద్యోగుల కోసం తాను తిండి మానేస్తున్నాననీ, మరి పెద్ద మగాడు కేటీయార్ ఏం చేస్తున్నాడని నిలదీశారు షర్మిల.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాల్లేవన్నారు. అలిగితే, మాట్లాడటం మానేస్తారు తప్ప.. వేరే చోట పార్టీ పెడతారా.? తెలంగాణలో రాజన్న రాజ్యం కోసమే పార్టీ పెట్టాను తప్ప, జగన్‌తో విభేదాల వల్ల కాదని షర్మిల స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కక్ష పూరిత రాజకీయాలు, పంతాల నడుమ జరుగుతోంది గనుక, అందులో ఎవరు గెలిచినా, ప్రజలకు ఒరిగేదేమీ వుండదని షర్మిల స్పష్టం చేశారు.. తాము పోటీ చేయాల్సిన అవసరమూ లేదన్నారు.

కాగా, కేటీయార్ ఎవరో తెలియదని షర్మిల వేసిన సెటైర్ పట్ల కేటీయార్ అభిమానుల నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే వస్తోంది. గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీయార్ ప్రస్తావన తెస్తూ, తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందడం గురించి కేటీయార్‌ని షర్మిల పొగిడిన వీడియోల్ని షర్మిలకే ట్యాగ్ చేస్తూ పంపిస్తున్నారు.