తెలంగాణలో షర్మిల పార్టీ ఓటు బ్యాంకు ఎంత.?

Sharmila's party

Sharmila's party

తెలంగాణలో ఎంత గింజుకున్నా షర్మిల పార్టీకి 5 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెబుతున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. జేసీ.. ఏ పార్టీలో వున్నా, ఆయనకి ‘కులాభిమానం’ కాస్త ఎక్కువ. ‘సీమ’ అభిమానం కూడా ఎక్కువే. ‘జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మావాడే’ అనడం ఆయనకు అలవాటు. అలాగని, జగన్ పంచన జేసీ దివాకర్ రెడ్డి చేరతారా.? అంటే, అందుకు జగన్ అవకాశమే ఇవ్వరు. ఇక, షర్మిల పార్టీ గురించి జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో షర్మిల పార్టీకి అంత సీన్ లేదని, తెలంగాణ పట్ల అసలామెకు ఆసక్తి లేదనీ, ఆంధ్రపదేశ్ మీదనే ఆమె ఫోకస్ వుందనీ, ఏదో ఒక పదవిని జగన్ ఆమెకు ఇచ్చి వుంటే, ఇప్పుడీ లొల్లి వుండేది కాదనీ, లోటస్ పాండ్ వేదికగా పార్టీ ఏర్పాటు కార్యక్రమాలు నడుస్తున్నా, అది విజయవాడకే తరలి వెళుతుందని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇదిలా వుంటే, ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల తన పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు. లక్ష మందితో సభ నిర్వహించి, అక్కడే పార్టీ ప్రకటన చేస్తానన్నారు షర్మిల. ఆ పార్టీ పేరు ఏదై వుంటుందబ్బా.? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘వైఎస్సార్’ అనే పేరు, షర్మిల పార్టీ పేరులో ఖచ్చితంగా వుంటుందట. పార్టీ జెండా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసేలానే వుంటుందట. అన్నతో రాజకీయ విభేదాలని షర్మిల చెబుతున్నా, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం ఆమె వెంట నడవబోతున్నాయి. ‘తెలంగాణలో పార్టీని వద్దనుకున్నాం..’ అని వైసీపీ ముఖ్య నేతలు ఇటీవల ప్రకటించిన దరిమిలా, వైసీపీ తెలంగాణ శాఖ అంతా, షర్మిల పార్టీలోకి మారడం ఖాయమే. పేరు వేరే తప్ప, జగన్ పార్టీ వైసీపీ అంశగానే షర్మిల పార్టీ తెలంగాణలో నడవనుందన్నమాట. జగన్‌లా కొన్నాళ్ళపాటు ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకుంటే, ఖచ్చితంగా జగన్‌లాగానే అధికార పీఠంపై ఆమె కూర్చునే అవకాశమూ లేకపోలేదు.