ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో షర్మిల స్పష్టత గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? అక్రమాస్తుల కేసులో సోదరుడు వైఎస్ జగన్ జైలుకు వెళ్ళాల్సి వస్తే, షర్మిల అన్నీ తానే అయి వ్యవహరించారు. సోదరుడు జగన్‌ని రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు షర్మిల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఏ మహిళా నాయకురాలూ చేయని రీతిలో షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాల్లో వైఎస్ జగన్ పాత్ర ఎంతో, షర్మిల పాత్ర కూడా అంతేనని అంటారు చాలామంది. సరే, ఆ విషయాల్ని పక్కన పెడితే.. ఆమె ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. త్వరలో తెలంగాణ గడ్డ మీద కొత్త రాజకీయ పార్టీ పేరుని ప్రకటించనున్నారు. కాగా, ‘తెలంగాణ రాష్ట్ర సమితికి బీ-టీమ్, బీజేపీకి బీ-టీమ్..’ అంటూ షర్మిల పార్టీ మీద వస్తున్న విమర్శలకు ఆమె చాలా ధీటుగా సమాధానమిస్తున్నారు. ‘మేం ఎవరికీ బీ-టీమ్‌గా వుండాల్సిన అవసరం లేదు’ అని ఆమె తేల్చేశారు. ‘మేం ఎవరికీ మద్దతివ్వడంలేదు. ఎవరి మద్దతుతోనూ రాజకీయాలు చేయబోవడంలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనతో ఎవరైతే మేలు పొందారో, వారంతా తెలంగాణలో మాకు అండగా వుంటారని నమ్ముతున్నాం..’ అని షర్మిల కుండబద్దలుగొట్టేస్తున్నారు. అయితే, షర్మిల ప్రసంగాలు పైకి ఎలా వున్నా, కింది స్థాయిలో మాత్రం చాలా అనుమానాలు షర్మిల వెంట నడుస్తున్నవారిలోనూ వున్నాయి. ఆమె గులాబీ పార్టీ కోసం రాజకీయాల్లోకి వచ్చారా.? బీజేపీ మేలు చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారా.? అనే అనుమానాలైతే పెరుగుతూనే వున్నాయి.