Mega Silence : చిరంజీవి గురించి చిరంజీవి తమ్ముడికి క్లాసులు తీసుకుంటున్నారు మీడియా సాక్షిగా మంత్రి కొడాలి నాని. ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకేముంటుంది.? అనే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సరే, రాజకీయాలంటేనే అలా వుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
రాజకీయంగా చిరంజీవి ఆలోచనలు వేరు, పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు వేరు. అయితే, అంతిమంగా తమ ఇద్దరి లక్ష్యం ఒకటేనంటారు చిరంజీవి. ప్రస్తుతం సినిమా, రాజకీయం.. రెండూ కలగలిసిపోయాయి పవన్ కళ్యాణ్ విషయంలో. ‘సినిమాలు మానెయ్యొద్దు.. నీ మీద నాకు నమ్మకం వుంది. నేనైతే రెండు పడవల మీద ప్రయాణం చెయ్యలేకపోయాను. నువ్వు చెయ్యగలవ్..’ అని చిరంజీవే స్వయంగా పవన్ కళ్యాణ్‌ని ప్రోత్సహించారు.. రాజకీయాల్లో వుంటూ, సినిమాలు చేసే విషయమై.
రాజకీయాల్లో వుంటే ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి వివాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో చిరంజీవికి తెలియనిది కాదు. ఇప్పుడంటే చిరంజీవి చాలామందికి ‘అందరివాడు’ అయిపోయాడుగానీ, అప్పట్లో చిరంజీవిని ‘కొందరివాడు’గా చేసేస్తూ చాలా రాజకీయమే నడిచింది. అది ప్రజారాజ్యం నాటి వ్యవహారం.
చిరంజీవిని మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్‌ని తిడుతున్న వైసీపీ నేతల విషయంలో చిరంజీవి వైఖరి ఎలా వుంటుంది.? ఈ విషయమై చిరంజీవి ఏమనుకుంటున్నారు.? అంటే, చిరంజీవి ఏ ఎమోషన్‌ని అయినా చాలా జాగ్రత్తగా తనలోనే దాచుకుంటారు. సమయమొచ్చినప్పుడు బయటపెడుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.
‘జాగ్రత్త..’ అని మాత్రమే పవన్ కళ్యాణ్‌కి పదే పదే చిరంజీవి సూచిస్తుంటారట. ‘భీమ్లానాయక్’ విషయంలో కూడా ‘గో ఎహెడ్..’ అనే ప్రోత్సాహమే పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి నుంచి అందిందనే అంటున్నారు. సమయమొచ్చినప్పుడు చిరంజీవి, తాను చెయ్యాల్సినవి చేస్తారంతే.