శశికళ…ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఈమె చుట్టూనే తిరుగుతున్నాయి. రాబోవు కాలంలో అనేక పెను మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆ కోవలోనే ఇప్పటికే తమిళనాడులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవించిన చిన్నమ్మ శశికళ, బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే. జనవరి 27న ఆమె జైలు నుంచి విడుదల కాగానే తమిళనాడు రాజకీయాల్లో సెగ మొదలయింది. ఆమె తీసుకునే నిర్ణయాలను బట్టి తమిళనాడులో రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే ఊహించని రీతిలో జైలు నుంచి బయటకు రాగానే, ఆమె కరోనా బారిన పడ్డారు. దీంతో విక్టోరియా ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆమె డిశ్చార్జ్ కావడంతోనే తమిళ రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అన్నాడీఎంకేలో రాజకీయ కలకలం మొదలయింది. అన్నాడీఎంకేలోకి ఆమెను చేర్చుకోమంటూ ఆ పార్టీ పెద్దలు ప్రకటిస్తున్నా, మధ్యాహ్నం విక్టోరియా ఆసుపత్రి వద్ద కనిపించిన ఓ సీన్, ఆ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శశికళ ఓ కారులో తన గృహానికి వెళ్లిపోయారు. అయితే ఆ కారు ముందు భాగంలో అన్నాడీఎంకే జెండా ఉండటంతో రాజకీయాంగా తీవ్ర చర్చ జరుగుతోంది. శశికళ కారుకు అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. అన్నాడీఎంకేలోకి శశికళను మళ్లీ చేర్చుకోబోమని, ఆమెను గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఆస్పత్రి వద్ద మాత్రం భారీ సంఖ్యలో అన్నాడీఎంకే అభిమానుల ఫ్లెక్సీలు, చిన్నమ్మకు జేజేలు పలుకుతూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కొందరు అన్నాడీఎంకే నేతలు కూడా ఆమె దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు.