సంగం పూర్తయ్యింది.! పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది.?

ఉమ్మడి నెల్లూరువాసుల కల నెరవేరింది. సంగం బ్యారేజీ పూర్తయ్యింది. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో ఈ బ్యారేజీని జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నో దశాబ్దాలుగా సంగం బ్యారేజీ విషయమై నానా రకాల రాజకీయాలు నడిచాయి. చివరికి వైఎస్ జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు ‘రిబ్బన్ కటింగు’కి నోచుకుంది.

ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించాల్సిందే. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుని ఈ ప్రాజెక్టుకి పెట్టడం కావొచ్చు, పనులు శరవేగంగా పూర్తి చేసే క్రమంలో చొరవ చూపించినందుకు కావొచ్చు.. వైసీపీ సర్కారుని అభినందించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

అయితే, పోలవరం ప్రాజెక్టు పరిస్థితేంటి.? పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో నడుస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ‘రాజకీయ శని’ పట్టుకుంది పోలవరం ప్రాజెక్టుకి. లేకపోతే, జాతీయ హోదా వచ్చి 8 ఏళ్ళు పూర్తయినా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడంలేదు.

‘ఘనత ఎవరిది.?’ అన్న కోణంలో నడుస్తున్న రాజకీయమే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శాపంగా మారిందన్నది ఓపెన్ సీక్రెట్. ఎవరో ఒకరు ఆ ‘ఘనత’ను తమ ఖాతాలో వేసుకుని, ప్రాజెక్టు పూర్తవడానికి చొరవ చూపెడితే అంతకన్నా కావాల్సిందేముంది.? సంక్షేమ పథకాలకు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ సర్కారు, పోలవరం ప్రాజెక్టుకి కావాల్సిన నిధుల్ని సొంతంగా ఖర్చు చేయలేక, కేంద్రం నుంచి రాబట్టలేక.. చేష్టలుడిగా చూస్తోంది.

ఇంకోపక్క, దేశాన్ని ఉద్ధరించేస్తున్నామని చెప్పుకుంటున్న మోడీ సర్కారు కూడా పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోవడంలేదు.