‘సమ్మతమే’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా : హీరో కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతున్న నేపధ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న “సమ్మతమే” చిత్ర విశేషాలివి.

“సమ్మతమే” చిత్రానికి మీరెలా సమ్మతమయ్యారు ?

దర్శకుడు గోపీనాథ్, నేను నాలుగేళ్ళుగా ప్రయాణిస్తున్నాం. హైదరాబాద్ కి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుండి గోపి నాకు పరిచయం. సినిమా పట్ల ఇద్దరికీ ఒకే అవగాహన, ప్యాషన్ వుంది. ఇద్దరం ఒక్కటిగా తిరిగి సినిమాపై ఇంకా అవగాహన పెంచుకుని, నేర్చుకున్నాం. ఈ క్రమంలో నేను ‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చేశాను. గోపి అప్పటికే ఇంకా కథని రాస్తున్నాడు. తను సమయం ఎక్కువ తీసుకుంటాడు. స్క్రిప్ట్ చాలా పగడ్బందీగా తయారైన తర్వాత ‘సమ్మతమే’ స్టార్ట్ చేశాం. చాలా సింపుల్ పాయింట్, ఫ్రెష్ పాయింట్. ఇలాంటి పాయింట్ ని ఎవరూ తీయలేదు. చాలా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాం. ప్రతి సీన్ చాలా వినోదాత్మకంగా వుంటుంది. రెండున్నర గంటలపాటు ఒక ఫ్రెష్ నెస్, బ్రీజీనెస్ వుంటుంది సినిమాలో.

సమ్మతమే కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ?

ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్ష్మీ ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే ‘నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని” నాన్నని అడుగుతాడు. పెళ్లి పై అంత శుభసంకల్పం వున్న ఒక క్యారెక్టర్ కి తన పెళ్లి చూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైయింది ? దాన్ని ఎలా ఎదుర్కున్నాడు ? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం వున్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది ? అనే అంశాలు చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. శేఖర్ చంద్ర గారు మంచి ఆల్బం ఇచ్చారు. ఏడు పాటలని ఎంజాయ్ చేస్తారు.

ఈ మధ్య నాలుగు పాటలే ఉంటున్నాయి కదా.. ఏడు పాటలు పెట్టడానికి కారణం ?

కథ డిమాండ్ చేసింది. పాటలన్నీ కథతో ముడిపడినవే. కథని మ్యూజికల్ గా చెప్పే క్రమంలో కథ నుండే పాటలు పుట్టాయి. పాటలన్నీ చక్కగా కుదిరాయి. మూడు పాటలు విడుదల చేశాం. ఇంకో మూడు పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. థియేటర్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయి. సినిమా ఓపెనింగ్ లో ఒక పాట వస్తుంది. అది నా ఫేవరేట్ సాంగ్ చాలా బావుంటుంది.

ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మాస్ ని ద్రుష్టిలో పెట్టుకొని కొన్ని కమర్షియల్ అంశాలు జోడించారు. సమ్మతమే ప్రేమకథగా చూపిస్తున్నారు. ఇందులో కూడా కమర్షియల్ అంశాలు ఉంటాయా ?

చూడటానికి ‘సమ్మతమే’ సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఇందులో మాస్ టీజింగ్ వుంటుంది. డైలాగుల్లో, బాడీ లాంగ్వేజ్ లో అది కనిపిస్తుంది. నేను ఎంత ఖరీదైన బట్టలు వేసుకొని క్లాస్ గా రెడీ అయినా తెలియకుండానే ఒక మాస్ ఫ్లావర్ పడుతుంది(నవ్వుతూ).

ట్రైలర్ లో ఒక డైలాగ్ కి బీప్ సౌండ్ కూడా వేశారు. యూత్ ని ఆకర్షించడానికా ?

లేదండీ. ఆ పరిస్థితిలో అతని బాధ ఎక్కువగా వుంటుంది. ఆ భాద లో ఆ మాట ఎవరైనా వాడుతారు. షూటింగ్ చేసినప్పుడు ఆ పదం అవసరమని చేశాం. ట్రైలర్ లో కూడా ఆ పధం వదిలేయవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలాంటి ఇబ్బంది వుండకూడదని బీప్ పెట్టి విడుదల చేశాం.

సినిమాలో మిగతా నటీనటుల గురించి ?

సినిమా లో చాలా పెద్ద కాస్ట్ వుంది. సప్తగిరి గారి ఎపిసోడ్ చాలా బావుంటుంది. చాలా మంది మంచి నటులు వున్నారు. సర్ప్రైజ్ కోసం చూపించలేదు. లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమా చేయాలని అనుకున్నాం. తెలియకుండానే సమ్మతమే పెద్ద సినిమా అయ్యింది. 75 లైవ్ లోకేషన్స్ లో సినిమా తీశాం. ఎక్కడా రాజీపడలేదు. మీరు చూసినప్పుడు కూడా ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు వున్నంతంగా వుంటాయి.

దర్శకుడు గోపితో ప్రయాణం గురించి ?

మేము ఇద్దరం అన్నదమ్ముల్లా వుంటాం. నా ప్రతి సినిమా రిలీజ్ కి గోపి ఫ్యామిలీ అంతా వస్తారు. మాఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది.

మూడు నాలుగు నెలల వ్యవధిలో కొత్త సినిమాతో వస్తున్నారు కదా.. ఇలా వరుస సినిమాలతో రావడం సరైన వ్యూహమేనా ?

నా వరకైతే సరైన వ్యూహమేనని చెప్తాను. హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. వరుసగా సినిమాలు బయటికి వస్తుంటే అందరికీ పని దొరుకుతుంది. అయితే ఒక సినిమాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటికి కేటాయించే సమయం ఎక్కువ. ప్రతి సినిమా పై చాలా కేర్ తీసుకుంటాను. నా దర్శకులు, నిర్మాతలు బలంగా వుండటం నా అదృష్టం. అనుకున్న సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ షూట్ చేయడానికి నిర్మాతలు సిద్దంగా వున్నారు. ఇప్పుడు రాబోతున్న నాలుగు సినిమాలు చాలా పెద్ద స్కేల్ లో చేశాం. మంచి సినిమాలు చేశాం. మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.

మీ ప్రతి సినిమాలో ఎదో ఎమోషన్ క్యారీ అవుతుంది కదా.. సమ్మతమేలో ఎలాంటి ఎమోషన్ వుంటుంది ?

ఒక అమ్మాయి తాలూకు ఎమోషన్స్ అన్నీ వుంటాయి. ప్రేమలో పడినపుడు, ఒక రిలేషన్ షిప్ లో వున్నపుడు ఇలా ప్రతి ఎమోషన్ ని కొత్తగా ప్రజంట్ చేశాం. అలాగే ఒక మధ్యతరగతి తండ్రి కొడుకు, తల్లి, కొడుకు మధ్య అనుబంధం చాలా ఎమోషనల్ గా వుంటుంది. ముఖ్యంగా సమ్మతమే క్లైమాక్స్ అద్భుతంగా వుంటుంది. క్లైమాక్స్ లో చెప్పే పాయింట్ కి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం.

మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపధ్యంలో వుంటుంది కదా ? దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ?

నాకు ఇలాంటి కథలు నచ్చుతున్నాయేమో. నేను దర్శక నిర్మాతలకు అలా కనిపిస్తున్నానేమో. నాపై ఇలాంటి కథలు చేస్తే వర్క్ అవుట్ అవుతాయని అనుకోవచ్చు. నేను కథ ఎంపిక చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్లకి మొగ్గు చూపను. నాకు మన మధ్య జరిగే కథలే ఇష్టం. ఇది మనోడి కథరా అనే ఫీలింగ్ వునప్పుడే నేను ఎక్కువ ఎక్సయిట్ అవుతాను. ఇలాంటి కథలే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాను.

సమ్మతమే టైటిల్ చాలా సాఫ్ట్ గా వుంటుంది కదా.. అందరికీ రీచ్ అవుతుందా లేదా అని చర్చించారా ?

ఇలాంటి టైటిల్స్ వినగా వినగా వాల్ పోస్టర్ పై చూడగా చూడగా ఎక్కువగా రీచ్ వుంటుంది. ఉదాహరణకి గీత గోవిందం. సమ్మతమే ఫార్మేట్ కూడా ఇలానే వుంటుంది. బొమ్మరిల్లు లాంటి సినిమాని చూసినపుడు ఎంటర్టైన్మెంట్, లవ్ ని ఫీలౌతూ ఒక మంచి ఫీలింగ్ తో బయటికివస్తాం కదా.,. అలాంటి వైబ్ లోనే సమ్మతమే వుంటుంది. సమ్మతమే టైటిల్ విన్నప్పుడే చాలా ఎక్సయిట్ ఫీలయ్యాం. పోస్టర్ లో కూడా టైటిల్ వైబ్రేటింగా వుంది.

‘సమ్మతమే’ ఒక అమ్మాయి ఎమోషన్ మీద నడిచే కథ అని చెప్తున్నారు కదా.,., హీరోయిన్ ని ఎంపిక చేయడానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? చాందినీని ఎంపిక చేయడనికి కారణం ?

హీరోయిన్ ని ఎంపిక చేసే క్రమంలో చాలా సమయం పట్టింది. దర్శకుడు గోపి ఐదు నెలలు తీసుకున్నాడు. నేను అప్పటికీ ఇంకా తెలిసిన హీరో కాలేదు. కేవలం రాజా వారు రాణి గారు ఒక్కటే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం చాలా ఆప్షన్స్ చూశాం. చాలా రిజక్సన్ కూడా అయ్యాయి. ఈ క్రమంలో తెలుగమ్మాయి చాందినీ అయితే ఇద్దరి జోడి బావుంటుందని దర్శకుడు గోపి చాందినీని ఫైనల్ చేశారు.

ట్రైలర్ లో పోటాపోటీగా మీ సీన్స్ కనిపిస్తున్నాయి.. సెట్స్ లో మీ కెమిస్ట్రీ ఎలా వుండేది ? మీ కెమిస్ట్రీని స్క్రీన్ పై ఎలా బ్యాలెన్స్ చేశారు ?

బయట కూడా మేము అలానే వుండటం వలన మాకు అది పెద్ద సమస్య కాలేదు. చాందినీ నాలానే కొంచెం హైపర్ యాక్టివ్ గా వుంటుంది. తన పోష్ కల్చర్ నాకు నిజంగానే తేడా వుండేది. దీంతో నటించాల్సిన అవసరం రాలేదు. (నవ్వుతూ). చాలా సహజంగా వచ్చేసింది.

రెట్రో సాంగ్ పెట్టినట్లు వున్నారు కదా ?

దీనికి కోసం చిన్న లిబర్టీ తీసుకున్నాం. హీరో తనకు అమ్మాయి లేదనే పెయిన్ లో వున్నపుడు కలలో వెళ్ళే ఒక స్వేఛ్చ వుంటుంది. అలా 90వైబ్స్ కి తీసుకెళ్ళి చేసిన పాట అది. పాట చాలా బాగా వచ్చింది.

చాందినీ, మీరు ఇద్దరూ షార్ట్ ఫిలిమ్స్ నుండే వచ్చారు కదా.. కలసి నటించడం ఎలా అనిపించింది ?

చాలా సంతోషంగా అనిపించింది. మేము ఎక్కడి నుంచి వచ్చామో మూలాలు తెలుసు. ఆ కంఫర్ట్ జోన్ వుంది. ఆ ఫ్రెష్ నెస్ ని మీరు స్క్రీన్ పై చూస్తారు. కృష్ణ ,శాన్వీ పెయిర్ చూడముచ్చటగా వుంటుంది. ట్రైలర్ చూసి చాలా మంది ఇదే చెప్పారు.

మీ కొత్త సినిమాల గురించి ?

ఆగస్ట్ లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ రిలీజ్ వుంటుంది. సెప్టెంబర్ చివరిలో ‘వినరో భాగ్యం విష్ణు కథ’ గీత ఆర్ట్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా వుంటుంది. ఈ ఏడాది లోనే ఈ మూడు సినిమాలు విడుదలౌతాయి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్