టీడీపీతో జనసేన ప్లస్ బీజేపీ: పైకి కత్తులు, తెరవెనుకాల పొత్తులు.!

పైకి కత్తులు దూసుకుంటుంటారు.. తెరవెనుకాల అనైతిక పొత్తులతో కలిసిపోతుంటారు. ఇదీ తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ – జనసేన పొలిటికల్ కాంబినేషన్ తాలూకు అసలు సిసలు రాజకీయ మర్మం. రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. ‘అవగాహన’ పేరుతో తెరవెనుకాల పొత్తులూ సర్వసాధారణమే. అయితే, మరీ ఇంత దారుణంగానా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ – బీజేపీ ప్లస్ సనసేన కాంబినేషన్ చాలా చిత్రమైనది. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ కుండబద్దలుగొట్టేస్తుంది. జనసేన కూడా అదే మాట వినిపిస్తుంటుంది. కానీ, ఈ మూడు పార్టీలూ అవసరమైన ప్రతిసారీ చేతులు కలుపుతున్నాయి.

స్థానిక ఎన్నికల వేళ ఈ చిత్రవిచిత్రమైన పొత్తు ఇంకోసారి గట్టిగా చిగురించేసింది. అప్పటిదాకా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్న పార్టీలు, ‘కింది స్థాయిలో అవగాహన’ పేరుతో కలిసి రాజకీయ నాటకమాడుతోంటే, ఓటర్లు విస్తుపోతున్నారు.

‘జనసేన అభ్యర్థిని గెలిపించండి..’ అంటూ బీజేపీతోపాటు, టీడీపీ నేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నెటిజనం విస్తపోతుండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పేరుకే జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. తెరవెనుకాల మాత్రం టీడీపీతో అవగాహనతోనే వున్నాయి.

అధికారిక, అనధికారిక పొత్తు ఫలితం 2014 అలాగే 2019 ఎన్నికల్లో స్పష్టంగా తేలిందంటూ మూడు పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతూనే వుందట. అయితే, ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. స్థానిక ఎన్నికల పేరుతో మూడు పార్టీల జెండాలూ కలిసి వైసీపీకి ఎదురు తిరుగుతున్నా.. ఆ మూడు పార్టీల్నీ జనం పట్టించుకోవడంలేదు. బద్వేలు ఉప ఎన్నిక ఫలితమే అందుకు నిదర్శనం.