2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా నటుడు బాలకృష్ణ టీడీపీ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ కంచుకోటగా ఆ నియోజక వర్గం ఎప్పుడు గెలుపు బావుటా ఎగరేస్తుంటుంది. కానీ అభివృద్ది పరంగా మాత్రం ఆ నియోజక వర్గం వెనుకబడే ఉంటుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. అయినా పార్టీపై నమ్మకంతో మరోసారి అక్కడి ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. అభివృద్ది విషయంలో వెనుకబడి ఉందని స్థానికుల్లో ఎప్పటికప్పుడు చర్చకొస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆ నియోజక వర్గం అభివృద్దికి పాటు పడతానంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ ఇంటర్వూలో అన్నారు.
అందుకు వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సహకారం తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఈ విషయంపై రోజాతో మాట్లాడారుట. ఆమె కూడా సానుకూలంగా స్పందించారని బాలయ్య చెప్పారు. పారిశ్రామికంగా ఆ నియోజక వర్గాన్ని అభివృద్ది చేయాలని ఎప్పటి నుంచో బాలయ్య అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక రకాలుగా అభివృద్ది చెందిందని చెప్పుకొచ్చారు అలాగే విజయవాడ వచ్చినప్పుడు తన కార్యాలయానికి రావాలని బాలయ్యకు రోజా పిలపు చేసారుట. ఆయన వచ్చే ముందు సమాచారం అందిస్తే అధికారులందర్నీ పిలిపిస్తానని రోజా మాటిచ్చినట్లు, లాక్ డౌన్ తర్వాత మరోసారి రోజాతో భేటీ అయిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని బాలకృష్ణ తెలిపారు.
రోజా-బాలకృష్ణ సినిమాల పరంగా సమకాలీకులు. ఇద్దరు జంటగా చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆన్ స్ర్కీన్ పై ఈ ఫెయిర్ కు మంచి పేరు ఉంది. ఆ రకంగా రోజా తో బాలకృష్ణకు మంచి స్నేహం ఉంది. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు అన్న నానుడి వీళ్లిద్దరి మధ్య ఒకటి కాదనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో చిన్న పాటి విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకున్నా! అవి అక్కడికే పరిమితయ్యాయి. ఇండస్ర్టీ పరంగా స్నేహితులుగా మెలుగుతూనే రాజకీయపరంగాను స్నేహితులుగా ఎలాంటి పొరపచ్చాలు లేవు అని తాజాగా బాలయ్య మాటలను బట్టి తెలుస్తోంది. గతంలో రోజా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే.