వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజాకి ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వుంది. ఏపీఐఐసీ ఐర్ పర్సన్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజా నోరు తెరిచారంటే, ప్రత్యర్థులు హడలిపోవాల్సిందే.
అలాంటిది, రోజా.. చేతులు జోడించి బతిమాలుకోవడమేంటి.? అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బతిమాలుకోవడమేంటి.? ఇదే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న అంశం.
రాయలసీమ కరువు కాటకాల్ని నివారించేందుకోసం ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నుంచి తమ వాటాలో భాగంగా నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్న విషయం విదితమే.
కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి అడ్డు తగులుతోంది. అంతే కాదు, కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఓ ఆనకట్ట నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది. మామూలుగా అయితే, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో అమీ తుమీకి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం సిద్ధపడాలి.
అంతేనా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని.. నరరూప రాక్షసుడిగా తెలంగాణ మంత్రులు అభివర్ణిస్తున్నారు. అక్కడితో ఆగడంలేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ళ దొంగ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గజ దొంగ.. అని కూడా విమర్శిస్తున్నారు.
ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో రోజా తన నోటికి పని చెప్పాల్సింది పోయి, చేతులు జోడించి బతిమాలుకోవడమేంటి.? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చుట్టూ బోల్డంత బలం వుందని ఇన్నాళ్ళూ అనుకున్నారు.
కానీ, వాళ్ళంతా చంద్రబాబు మీద విరుచుకుపడ్డానికి తప్ప, తన విషయంలో తెలంగాణ నుంచి వచ్చే రాజకీయ దాడికి అడ్డంగా నిలబడేందుకు ఎవరూ లేరన్న విషయాన్ని వైఎస్ జగన్ ఇప్పటికైనా గుర్తించాల్సి వుంది.
చిత్రమేంటంటే కేసీయార్‌ని విమర్శించాల్సిన సమయంలో కూడా రోజా, చంద్రబాబు మీద విమర్శలకు ప్రాధాన్యతనివ్వడం.