RGV: తన కెరీర్‌లో మోస్ట్ ఎక్సైంటింగ్ సంఘటన అంటే రామ్ గోపాల్ వర్మతో కలిసి పని చేయడం, ఆయన సినిమా అనుక్షణంలో నటించడమేనని సీరియల్ నటుడు అవినాష్ తెలిపారు. ప్రత్యక్షంగా ఆయన్ని సెట్లో చూడడం, ఆయన డైరెక్షన్‌లో తాను నటించడం చాలా ఆనందంగా అనిపిస్తుంటుందని అవినాష్ అన్నారు. ఆయనచాలా కూల్ అండ్ వెరీ డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపోతే తాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అనుక్షణం సినిమాకు సంబంధించి తనకు 6 సీన్లలో నటించాల్సి ఉంటుందని చెప్పారని నటుడు అవినాష్ అన్నారు. మామూలుగా సీరియల్‌లో అయితే 6 సీన్లు తీయడానికి 1 రోజు పడుతుందని, అదే ఒక కమర్షియల్ సినిమాలో అవే 6 సీన్లు తీయాలంటే కనీసం 3 రోజులైనా పడుతుందని ఆయన చెప్పారు. కానీ వర్మ గారి విషయానికొచ్చే సరికి దానికి భిన్నంగా ఉంటుందని అవినాష్ అన్నారు.
ఇదిలా ఉండగా షూటింగ్ కోసం తాను, సనా, విలన్ క్యారెక్టర్ ఉన్న అతను అక్కడికి వెళ్లాను. తాము వెళ్లగానే మేకప్ ఎక్కడా అంటే చూపించారు.. ప్రొడక్షన్ ఎక్కడా అంటే అలాంటిదేం లేదు మీకు ఏం టిఫిన్ కావాలో చెప్పండి అన్నారు.. చెప్పగానే పార్సిల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత కాస్య్టూమ్ ఎక్కడా అంటే డైరెక్టర్ గారికి చూపించి తీసుకొచ్చారు. ఆ షర్ట్ కొంచెం నలిగిపోయి ఉండడంతో దాన్ని కొంచెం ఇస్త్రీ చేయించి తీసుకురండి కాస్టూమర్స్‌కి చెప్పి అంటే.. అలాంటివేం లేవండి అన్నారని, మరెలా అంటే వర్మ గారిని అడిగి వస్తానంటూ ఓ వ్యక్తి వెళ్లాడని అవినాష్ అన్నారు. ఆయన్ని అడిగితే ఆ ఇంట్లోనే ఉన్నారు కదా న్యాచులర్‌గా ఉంటుంది వేసుకోండి అన్నారని, దాంతో తనకు పిచ్చెక్కిపోయిందని అవినాష్ చెప్పారు.
ఇక అక్కడ చూస్తే లైట్లు లేవు, లైట్‌మెన్‌లు లేరు, ప్రొడక్షన్ వాళ్లు లేరు, హడావిడి లేదు. అక్కడ కేవలం కెమెరామెన్, ఆపరేటివ్ కెమెరామెన్, ఒక చిన్న ట్యూబ్‌లైట్ మాత్రమే ఉన్నాయని, దాంతోనే ఒక చిన్న కెమెరాతోటి మొత్తం 6 సీన్లు 9 గంటలకు మొదలుపెడితే 11.45, 12 లోపు ప్యాకప్ అయిపోయిందని ఆయన చెప్పారు. అది తనకెప్పుడూ షాకింగ్‌గానే అనిపిస్తూ ఉంటుందని ఆయన అన్నారు. ఆ ఆఫ్ డేలో కూడా రెండు భాషల్లో షూట్ చేశామని, తాను సింగిల్ టేక్‌లోనే అన్ని సీన్‌లు చేశానని ఆయన వివరించారు.