డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి రాజకీయం.. నిజంగానే వాళ్ళని తప్పించారా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నారా.? డ్రగ్స్ కేసులో కొందరి పేర్లను తప్పించారంటూ తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్ని ఎలా చూడాలి.? కొన్నేళ్ళ క్రితం వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు గతంలోనే తెలంగాణ సిట్ యెదుట హాజరయ్యారు. ఆ కేసు ప్రస్తతం ఈడీ ముందుకొచ్చింది. పలువురు సినీ ప్రముఖులు వరుసగా ఈడీ యెదుట హాజరవుతున్నారు. డ్రగ్స్ విషయమై పెద్దమొత్తంలో నగదు చేతులు మారిందనే కోణంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సిట్ ఎవరెవర్నయితో విచారించిందో.. వారికి మరికొందరు అదనంగా ఈడీ యెదుట విచారణకు హాజరవుతున్నారు. మీడియాలో జరుగుతున్న హంగామాకీ, విచారణ జరుగుతున్న తీరుకీ పొంతనే లేదన్న వాదన సంగతి పక్కన పెడితే, ఈడీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుందా.?

విచారణ నుంచి ప్రముఖులు తప్పించుకునే అవకాశముందా.? ఒకవేళ తప్పించుకునే అవకాశముంటే, వాళ్ళంతా సినీ ప్రముఖులేనని రేవంత్ రెడ్డి ఆరోపించదలచుకున్నారా.? ఏమోగానీ, డ్రగ్స్.. అనగానే సినీ పరిశ్రమ పేరు మాత్రమే తెరపైకి ఎందుకు వస్తోంది.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమై. హై ఫై లైఫ్ నేపథ్యంలో సినీ ప్రముఖులతోపాటు, రాజకీయ ప్రముఖులు, పలువురు ఉన్నతాధికారుల వారసులు.. ఈ డ్రగ్స్ మాయలో కొట్టుమిట్టాడుతున్నారనే ఆరోపణలు వున్నాయి. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రేవంత్ నోట కూడా బయటకొచ్చాయి. మరి, ఈ మొత్తం వ్యవహారంలో ఏం తేలబోతోంది.? వేచి చూడాల్సిందే.