కీలకమైన పదవి దక్కినా పాపం రేవంత్ రెడ్డికి టైమ్ కలిసొస్తున్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తల పండిన నాయకులకే మింగుడు పడవు. రేవంత్ రెడ్డిలాంటి ఆవేశపరుడికి కీలకమైన పదవి దక్కడమంటే, రాజకీయంగా అది దిన దిన గండం, నూరేళ్ల ఆయుష్షు అన్నట్లే ఉంటుంది. దాదాపుగా ఓ పాతిక నుండి ఏభై మంది వరకూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా రేవంత్ రెడ్డి తీరుపై బాహాటంగానే పెదవి విరుస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రస్థావించుకోవాలి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి మీద విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తీరు అస్సలు బాగోలేదని జగ్గారెడ్డి గుస్సా అవుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందట. అయినా, ఈ కుమ్ములాటలే కాంగ్రెస్ పార్టీకి శాపం.
కాంగ్రెస్ పార్టీకి వేరే శత్రువులు అవసరం లేదు. సొంత పార్టీలోనే ఒకరినొకరు రాజకీయంగా వెన్నుపోటు పొడిచేసుకుంటారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి మరణంతోనే తెలుగు నాట కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. ఇప్పుడది పతాక స్థాయికి చేరింది. ఏపీలో కాంగ్రెస్ లేనే లేదు. తెలంగాణాలోనూ కాంగ్రెస్ గల్లంతైపోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. రేవంత్ రెడ్డి మాత్రం వీరావేశంతో పార్టీని ఉద్ధరించేస్తానంటున్నారు. పార్టీ కోసం గట్టిగా నిలబడతానని రేవంత్ అంటుంటే, నిర్మొహమాటంగా ఆయన్ని కాళ్లు పట్టుకుని కిందకి లాగేస్తున్నారు జగ్గారెడ్డిలాంటోళ్లు. కాంగ్రెస్ బాగుపడితే, దాంతో పాటూ తామూ లాభపడతామన్న కనీసపాటి లాజిక్ కాంగ్రెస్ నాయకుల్లో లేకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఏమో. ఇదిలా ఉంటే, రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందంటూ, వైఎస్ షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.