రేవంత్ రెడ్డి అతి దూకుడు.. రైటా.? రాంగా.?

మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించడంలేదు గత కొంతకాలంగా. అలాంటి ఆయన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలవడం ఆశ్చర్యకరమే. కాంగ్రెస్ పార్టీలోకి దేవేందర్ గౌడ్ సహా ఆయన కుమారుల్ని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దేవేందర్ గౌడ్ ఒకప్పుడు టీడీపీ మయాంలో ఓ వెలుగు వెలిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. రేవంత్ సంగతి సరే సరి. అసలు, రేవంత్.. ఈ పునరేకీకరణ ఎందుకు చేస్తున్నట్లు.? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ నాయకత్వంలో బలోపేతమవుతోందా.? ఇలా చాలా చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో.

ఒక్కటి మాత్రం నిజం.. రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ అయితే నింపుతోంది. కానీ, ఆయనకు అసలు సిసలు పరీక్ష హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ద్వారా ఎదురుకానుంది. అందుకే, రేవంత్ ఇప్పటినుంచే తగిన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏ సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ నాయకుడ్ని కలిస్తే, ఎలాంటి పొలిటికల్ మైలేజ్ వస్తుందో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొందరు సీనియర్ పొలిటీషియన్లు ‘వెలుగు’ కోల్పోయారు. అలాంటివారందర్నీ రేవంత్ రెడ్డి మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ దూకుడు ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తిరిగొచ్చే అవకాశముందని, నిఖార్సయిన కాంగ్రెస్ వాదులూ అభిప్రాయపడుతుండడం గమనార్హం. అయితే, రేవంత్ రెడ్డికి సమస్య వేరే పార్టీలకు చెందిన నాయకుల నుంచి కాదు.. సొంత పార్టీకి చెందిన నాయకుల నుంచే ఎదురుకావొచ్చు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత. ఎదుగుతున్న నాయకుల్ని కిందకి లాగేసి, తద్వారా పార్టీని నాశనం చేసేటోళ్ళు కాంగ్రెస్లో ఎంతోమంది వున్నారు. వాళ్ళ నుంచి రేవంత్ తనను తాను కాపాడుకుని, కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాల్సిందే.