సీనియర్లు ఆపుతున్నా కేసీఆర్ ఓటమే లక్ష్యంగా రేవంత్ సంచలన నిర్ణయం 

Revanth Reddy not listening to Congress seniors
రేవంత్ రెడ్డి రూటే సపరేటు.  ఎవరెన్ని అనుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ అనుకున్నది చేస్తారు.  తెలుగుదేశంలో ఉన్నా ఇదే వ్యవహారశైలి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అదే శైలి.  కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టిన వెంటనే రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్నారు.  అక్కడే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ఆయనంటే కంటగింపు మొదలైంది.  దానికి తోడు సీనియర్లను సైతం లెక్కచేయని రేవంత్ దూకుడు పార్టీలో నిత్యం చర్చనీయాంశమే.  వీలైనప్పుడల్లా రేవంత్ మీద బురద చల్లడానికి కొందరు సీనియర్ నేతలు రెడీగా ఉంటున్నారు.  వారిలో వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుంటారు.  పీసీసీ చీఫ్ పదవిలో మార్పు అనే అంశం తెరపైకి వచ్చనప్పుడల్లా రేవంత్ పేరు గట్టిగా వినిపిస్తుంది.  
 
ఇన్నాళ్లు సీనియర్ల చేతిలో ఉన్న పార్టీని ఒక్కసారైనా యువ నాయకులకు అప్పగిస్తే బాగుంటుందని చాలా కాలం నుండి వాదన వినిపిస్తోంది.  రేవంత్ రెడ్డికి కూడా పీసీసీ చీఫ్ పదవి చేపట్టాలనే కోరిక ఉంది.  అందుకే ఎప్పటికప్పుడు తన నిబద్దతను, పనితనాన్ని నిరూపించుకుంటూ ఉంటారు.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ సీనియర్ నాయకుడూ చేయని తరహాలో కేసీఆర్ మీద, ఆయన పాలన మీద రేవంత్ పోరాడుతున్నారు.  చిన్న ఆధారం దొరికినా దాంతో మొత్తం తెరాస ప్రభుత్వాన్నే కూల్చేస్తానన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.  అదే ఆయనకు సపరేట్ క్రేజ్ తెచ్చిపెట్టింది.  ఆ క్రేజ్ మూలంగానే ఆయనకు పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. 
 
దీంతో కేసీఆర్ మరింత దూకుడు పెంచారు.  ఏకంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట ఆయన.  అందుకే ముందుగా తన అనుచరగణంతో రేవంత్ పాదయాత్ర అంటూ లీకులు ఇప్పిస్తున్నారని, నేరుగా అధిష్టానానికి ఈ విషయం చెప్పకుండా, వార్తల మీద వారి రియాక్షన్ ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ అవుదామనేది ఆయన ఆలోచనట.  ఇన్నాళ్లు కేసీఆర్ మీద రేవంత్ చేసిన ఫైట్ ఒక ఏత్తైతే ఈ పాదయాత్ర ఇంకో ఎత్తని అంటున్నారు రేవంత్ అనునాయులు.  పాదయాత్రకు హైకమాండ్ ఓకే అంటే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి సొంతమవడం లాంఛనమే.  అందుకే సీనియర్లు సమయం సంధర్భం లేకుండా పాదయాత్ర ఎందుకని, ఇది కేవలం రేవంత్ వ్యక్తిగత ఆర్భాటమని అంటున్నారు.  కానీ అవేవీ పట్టించుకోని రేవంత్ కేసీఆర్ మీద పోరాటానికి, పీసీసీ చీఫ్ పదవిని చేపట్టడానికి పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేసుకుని పెట్టుకున్నారట.